కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్‌తోకూడిన పాలిటిక్స్‌లో చంద్రబాబు మరింతగా బరితెగించారని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ దమనకాండను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వ్యవస్థీకృత నేరం కాదా? అని ఆయన నిలదీశారు. సోషల్ మీడియాపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎండగట్టారు. దొంగే… ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబుగారి తీరు ఉంది.
నలభై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబుగారు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని, తన పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారనే దురహంకారంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబుగారి తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైం కాదా? అని ప్రశ్నించారు.