మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెడుతున్న అసభ్యకరమైన పోస్టులపై మంగళగిరి డీజీపీ కార్యాలయంలో డీజీపీకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిర్యాదు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తో సోషల్ మీడియా యాక్టివిస్టులను తీసుకెళ్తున్న పోలీసులు.. వారి అరెస్టును చూపించకుండా... రోజుల తరబడి వివిధ పోలీస్ స్టేషన్లలో తిప్పడం, వేధించడంతో పాటు వారిని కొడుతూ చిత్రహింసలకు గురిచేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైన నేపధ్యంలో తప్పక... పోలీసులు ఇవాళ సుధారాణి దంపతులను గుంటూరు మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారని ఆయన స్పష్టం చేశారు. సుధారాణి, ఆమె భర్తను పోలీసులు దారుణంగా కొట్టిన విషయాన్ని మెజిస్ట్రేట్ ముందే స్టేట్‌మెంట్ రికార్డు చేసిన విషయాన్ని వెల్లడించారు. ఈ రకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల ప్రోత్సాహంతోనే పోలీసులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడికి దిగుతున్నారని అంబటి మండిపడ్డారు. వీటిని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద అసభ్యంగా పోస్టులు పెట్టినవారిని తాము సమర్ధించడంలేదన్న అంబటి... ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు ఫైల్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అమ్మకు నిల్... తండ్రికి పుల్, విద్య వద్దు.. మద్యం ముద్దు అంటే కేసులు పెడతారా అని నిలదీశారు. ఇదే విషయాన్ని డీజీపీకి వివరించామన్నారు. అధికార పార్టీ నేతలపై ఏ పోస్టులు పెట్టారని మీరు అరెస్టు చేశారో... అదే రకంగా జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులుమీద అత్యంత దారుణంగా పోస్టులు పెట్టిన వారిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ధర్మమేనా? అని నిలదీశారు. పోలీసు వ్యవస్ధ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే... ఇలాంటి పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా అరెస్టు చేస్తుందా? లేదా? అన్న అంశాన్ని వేచి చూస్తామన్నారు. అక్రమంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులను నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకునేంతవరకు కచ్చితంగా పోరాటం చేస్తామని అంబటి స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించనన్న చంద్రబాబు... ఆడబిడ్డ సుధారాణిని పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటనపై ఏ విధంగా స్పందిస్తారని ప్రశ్నించారు.