రాష్ట్రంలో ప్రభుత్వం మద్దతుతో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని సోషల్ మీడియా ప్లాట్‌పాం ఎక్స్‌లో పోస్టు చేస్తే దానిపై కేసు పెట్టి యర్రగొండపాలెం ఎస్‌ఐ తనకు వాట్సప్‌లో ఎఫ్‌ఐఆర్ పంపించడంపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు సాగుతున్నాయని... సాక్షాత్తూ టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే జూలై 5న పేకాట క్లబ్బులు తెరిపిస్తానని బహిరంగంగా మాట్లాడారని ఆయనపై ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. మరోవైపు కూటమిపార్టీలకు మద్ధతునిచ్చే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌లో ఆగష్టు 5న రాష్ట్రంలో విచ్చల విడిగా పేకాట నడుస్తుందని వార్తలు వచ్చాయన్నారు. ఇవేవీ ఎందుకు కనిపించలేదని నిలదీశారు.
ఇచ్చిన హామీల అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వివిధ సోషల్ మీడియా వేదికలుగా ప్రశ్నిస్తున్న వారందరినీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులగా చిత్రీకరించి అరెస్టులు చేయడం అత్యంత దారుణమన్నారు. దానికి పరాకాష్టగా ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యతగల ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తే... అదే నేరం, తప్పుగా నాపైనే కేసులు పెట్టడం పిరికిపంద చర్య అని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యర్రగొండ పాలెంలో ఎస్టీ మహిళమీద టీడీపీ నేత దాడిచేస్తే... పోలీస్ స్టేషన్‌లో పిటీ కేసు నమోదు చేసి బాధిత మహిళ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో తప్ప ఇంత దుర్మార్గం, ఇంత అరాచకం, మారణకాండ గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేవని తేల్చి చెప్పారు. అయినా బాధ్యత గల ప్రతిపక్షంగా తాము ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.