ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను, తప్పిదాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూపిస్తే.. అధికార పార్టీ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో పాటు వారి కుటుంబసభ్యులనూ వేధించడంపై ఆయన మండిపడ్డారు.
ఇప్పటికీ కొంతమంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బాధిత కుటుంబాల తరపున హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశామన్నారు. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వారిని కోర్టుల్లో ప్రవేశపెట్టకతప్పలేదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ , ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేతలపైనా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అసభ్యకరమైన పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన అన్ని వివరాలను ఆధారాలతో సహా ఇవాళ డీజీపీకి అందించామని చెప్పారు. అత్యంత అమానుషంగా, అసభ్యకరంగా ఈ పోస్టుల పెట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.