కలెక్టర్ల సదస్సును ఈనెల 24, 25తేదీల్లో నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నది. తొలిసారి జరిగిన కలెక్టర్ల సమావేశంలో చర్చించిన, తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్లు పురోగతి వివరించేలా నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గడిచిన నాలుగు నెలల్లో ప్రభుత్వ శాఖల వారీగా నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత తొలి కలెక్టర్ల సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. అధికార దర్పానికి దూరంగా ఉండాలని... పేదలకు దగ్గర కావాలని సూచించారు. ఎమ్మెల్యేలూ, మంత్రులకూ ఇదే చెప్పారు. ‘మా ప్రభుత్వ విధానం, మా లక్ష్యాలు ఇవి. మీరు వినూత్నంగా ఆలోచించండి. మనసుపెట్టి పని చేయండి. ఫలితాలు సాధించండి’ అని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ఎప్పటికప్పుడు అందరి పనితీరు సమీక్షిస్తుంటానని చంద్రబాబు చెప్పారు.