పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలకు అంతర్జాతీయ నిపుణుల బృందం, కేంద్ర జల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం పనులు చేపట్టడం.. పూర్తి చేయడంపై ఉన్న సందిగ్ధాలన్నింటినీ తొలగించాయి. 2025 జనవరిలో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించి.. ఆ ఏడాది నవంబరుకే పూర్తి చేయాలని జర్మన్ కాంట్రాక్టు సంస్థ బావర్‌కు జల సంఘం ఆదేశాలిచ్చింది. వాల్‌కు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ డ్యాంను నిర్మిస్తే ఏడాది సమయం కలిసి వస్తుందన్న రాష్ట్ర జల వనరుల శాఖ అభిప్రాయంతో, అధ్యయన నివేదికలతో అంతర్జాతీయ నిపుణులు, జల సంఘం అధికారులు సమ్మతించారు.
700 మీటర్ల మేర వాల్ నిర్మాణం పూర్తయిన వెంటనే.. సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు మొదలు పెట్టేందుకు జలసంఘం అనుమతి ఇచ్చింది. ఇందుకు శుక్రవారంనాటి సమీక్షలో సూత్రప్రాయంగా సమ్మతించిన సంగతి తెలిసిందే. ఆరో తేదీ నుంచి మూడ్రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు క్షేత్రంలో, శనివారం ధవళేశ్వరంలోని ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన వర్క్‌షాపులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకరోజు ముందే వర్క్‌షాపును ముగించారు. చివరిరోజు సమీక్షలో.. ప్రాజెక్టు పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని జలసంఘం స్పష్టంచేసింది. ప్రతి 15 రోజులకోసారి పనులను వీడియా కాన్ఫరెన్సు ద్వారానే గాక ప్రత్యక్షంగానూ పరిశీలిస్తామని జలసంఘం చీఫ్ ఇంజనీర్ విజయ్ శరణ్ తేల్చిచెప్పారు. ఫిబ్రవరిలో మరోసారి ప్రాజెక్టు క్షేత్రంలో సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం అక్కడ సెంట్రల్ సాయిల్-మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎ్‌సఎంఆర్‌ఎస్) నిర్వహిస్తున్న నాణ్యతా ప్రమాణాల పరీక్షలతో పాటు..రాష్ట్ర జల వనరుల శాఖ కూడా ప్రత్యేకంగా లేబొరేటరీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంబంధిత నివేదికలను ఎప్పటికప్పుడు పీపీఏ ద్వారా తమకు అందజేయాలన్నారు. అలాగే డయాఫ్రం వాల్, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం డిజైన్లను తమకు పంపాలని.. డిజైన్లను రూపొందిస్తున్న ఆఫ్రీ సంస్థను జలసంఘం ఆదేశించింది. ఈ నెలాఖరు నాటికి డిజైన్లను పంపితే వాటిని పరిశీలించి.. వచ్చే ఫిబ్రవరికల్లా ఆమోదం తెలుపుతామని తెలిపింది. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం ప్రాంతంలోని గ్యాప్-1, గ్యాప్-2 పూడ్చివేతలు.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలలో సీపేజీ నివారణకు చేపట్టనున్న కార్యాచరణ, వైబ్రో కంపాక్షన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేసింది. కాగా.. డయాఫ్రం వాల్ పనులు 700 మీటర్లకు చేరుకోగానే అటు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు కూడా ప్రారంభిస్తే.. 2027 నాటికి పోలవరం ప్రధాన డ్యాం పనులన్నీ పూర్తయిపోతాయని.. తత్ఫలితంగా ఏడాదికాలం కలసి వస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ వివరించింది.