విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడలోని సత్యనారాయణపురానికి చెందిన కాసుల కవిత (49), ఆమె కుమార్తె హర్షిత (24) కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నారు. వీరు ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్దకు చేరుకోగానే, కారు వేగంగా వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొంది.
ఈ ప్రమాదంలో తల్లి కవిత అక్కడికక్కడే మృతిచెందగా, కూతురు హర్షిత విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. నందిగామకు చెందిన కారు డ్రైవర్ కొప్పురావూరి సాయికృష్ణ తీవ్రంగా గాయపడగా, ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, హర్షితకు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈలోపు ప్రమాదం జరగడంతో సత్యనారాయణపురంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుత్రికి పంపిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.