మధుమేహంతో బాధపడే వ్యక్తులు జీవితాంతం ఇన్సులిన్ తీసుకుంటూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రీజనరేటివ్ థెరపీ వారికి ఓ చక్కని పరిష్కారం. టైప్-1 డయాబెటి్‌సతో బాధపడేవారు ఆ థెరపీతో సాధారణ జీవితాన్ని గడపవచ్చు’’ అని యూఏఈకి చెందిన ప్రముఖ వైద్యుడు, రీజనరేటివ్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ అలీ అల్దీబియాత్ చెప్పారు.
విశాఖలో జరుగుతున్న ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా 53వ వార్షిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. శనివారం మూడో రోజు సదస్సులో ఐలెట్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పలు విషయాలు వెల్లడించారు. ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, ఇతర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. అయితే డయాబెటిస్ రోగులు జీవితాంతం ఇబ్బంది పడాలని చాలామంది భావిస్తుంటారని, ముఖ్యంగా టైప్-1 బాధితులకు ఇన్సులిన్ తప్ప మరోమార్గం లేదన్న భావన ఉందన్నారు. వారు అధునాతన రీ జనరేటివ్ థెరపీతో సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం లభిస్తుందన్నారు. దీనిపై సుదీర్ఘకాలం పరిశోధన చేయడంతో పాటు సుమారు 300 మందికి ఈ థెరపీని విజయవంతంగా పూర్తి చేసినట్టు వెల్లడించారు.