రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని, వాటన్నింటిని కలిపితే ఆంధ్రప్రదేశ్.. దేశానికే కాకుండా ప్రపంచానికే పర్యాటక ఆకర్షక ప్రాంతంగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీశైలం క్షేత్రంతో పాటు పర్యాటక అభివృద్ధికి తిరుమల తిరుపతి తరహాలో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని వెల్లడించారు. శనివారం విజయవాడ ప్రకాశం బ్యారేజీలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సర్వీసు డెమోను ప్రారంభించిన ఆయన.. సీ ప్లేన్‌లోనే శ్రీశైలానికి చేరుకున్నారు. ఆయన వెంట పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా ఉన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో సీ ప్లేన్‌లో దిగిన సీఎంకు రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేశ్, ఎన్‌ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, డీఐజీ కోయ ప్రవీణ్, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా విజయవాడ కనకదుర్గమ్మవారి స్థానం నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ, శక్తిపీఠం శ్రీశైలానికి సీ ప్లేన్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ‘ఇప్పటి వరకు హెలికాప్టర్లు, విమానాల్లో ప్రయాణించాను. ఇవి దిగే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ సీ ప్లేన్‌తో అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇందులో ప్రయాణించడం ప్రత్యేక అనుభూతినిచ్చింది. తుమ్మలబయలులో టైగర్ సఫారీకి అవకాశం ఉంది. ఇక శ్రీశైలం డ్యాం ఒక అద్భుతం. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలాగే శ్రీశైలం కూడా పచ్చని ప్రకృతితో నిండి ఉంటుంది. ఇక్కడ పర్యాటకాభివృద్ధికి అటవీ, పర్యావరణ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గేశ్, రోడ్లు-భవనాల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిలతో కమిటీ వేసి, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌తో పాటు సంబంధిత అఽధికారులతో కలిసి మాస్టర్ ప్లాన్ తయారుచేస్తాం. రిపోర్టు ఆధారంగా పనులు చేపడతాం’ అని వెల్లడించారు. పర్యాటక వనరులను సద్వినియోగం చేసుకోగలిగితే వైట్‌కాలర్ జాబ్స్ వస్తాయన్నారు. శ్రీశైలం నుంచి తిరిగి సీ ప్లేన్‌లో విజయవాడకు చేరుకున్న ఆయన.. మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. సుందరమైన ప్రాంతాలను వీక్షించామని, ఎంతో అనుభూతి పొందానని భావోద్వేగంతో చెప్పారు. ల్యాండింగ్, టేకాఫ్ చాలా స్మూత్‌గా జరిగిందని చెప్పారు.