ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పన్ను చెల్లింపుదారులూ.. ఇంకో 5 రోజులే గడువు.. వెంటనే మీ ఐటీఆర్ ఫైల్ చేయండి

business |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2024, 11:29 PM

పన్ను చెల్లింపుదారుల్లో ఎవరి ఖాతాలైతే ఆడిట్ చేయాల్సి ఉంటుందో వారందరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసేందుకు మరో వారం రోజులే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు నవంబర్ 15. ఈ తేదీలోపు పూర్తి చేయని వారికి భారీగా పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. ఈ మేరకు ఇటీవలే ఓ ప్రకటన జారీ చేసింది ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961లోని సెక్షన్ 92ఈ కిందకు రాని కంపెనీలు లేదా సెక్షన్ 44ఏబీ కింద ట్యాక్స్ ఖాతాలు ఆడిట్ చేసిన కంపెనీలు, ట్యాక్స్ పేయర్లు కచ్చితంగా గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయాలని స్పష్టం చేసింది. వారందరికీ నవంబర్ 15, 2024 వరకే అవకాశం ఉంటుందని నొక్కి చెప్పింది.


సాధారణంగా తమ ఖాతాలు ఆడిట్ అవసరం ఉన్న ట్యాక్స్ పేయర్లు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు (ITR Filing) దాఖలు చేసేందుకు అక్టోబర్ 31 వరకే అవకాశం ఉంటుంది. అయితే, పను సాంకేతిక సమస్యల కారణంగా ఈ గడువును రెండు వారాలు పొడిగించి కొత్త డెడ్‌లైన్ నవంబర్ 15, 2024గా పేర్కొంది ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం. దీంతో చాలా మంది ఊరట లభించిందని చెప్పవచ్చు. రూ.1 కోటికిపైగా టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు లేదా రూ.50 లక్షలకుపైగా ఆదాయం ఉన్న వృత్తి నిపుణుల ఖాతాలు ఆడిట్ అవసరం ఉంటుంది. అలాగే సెక్షన్ 44ఏబీ ప్రకారం ఆడిట్ అవసరమైన ఖాతాలు గల సంస్థలతో భాగస్వాములకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయి. అందులో వ్యాపార టర్నోవర్ రూ.1 కోటి దాటడం లేదా రూ.50 లక్షలకుపైగా ఆదాయం గల వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబ సభ్యులు ఉంటారు.


అయితే, ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు తమ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసేందుకు జులై 31వ తేదీతో ముగిసింది. ఈ ఏడాది జులై 31, 2024 నాటికి 7 కోట్లకుపైగా ఐటీ రిటర్నులు దాఖలైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రూ.1 కోటి ఆపైన ఆదాయం గల 9.54 లక్షల మంది ట్యాక్స్ పేయర్లు అక్టోబర్ 31 వరకు తమ ఐటీ రిటర్నులను దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన లేటెస్ట్ డేటా ప్రకారం రూ.1 కోటికిపైగా ఆదాయం గల వ్యక్తులు ఒక్క అక్టోబర్, 2024 నెలలోనే 2.76 లక్షల ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు సెప్టెంబర్ నెలలో 2.38 లక్షల రిటర్నులు ఫైల్ అయ్యాయి. అంతకు ముందు ఆగస్టు నెలలో 2.15 లక్షలు, జులైలో 2.08 లక్షల మంది రిటర్నులు ఫైల్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com