9 ఏళ్లు.. ఈ వయసు గురించి వింటే అందరికీ బాల్యమే గుర్తుకొస్తుంది. స్కూలుకు వెళ్లడం, తోటి పిల్లలతో కలసి ఆడుకోవడం, అమ్మ ప్రేమ, నాన్న లాలన, నానమ్మ చెప్పే కథలు..ఇవే గుర్తుకొస్తాయి. లోకం గురించి తెలియని వయసు అది. చదువు, ఆటపాటలు తప్ప వేరే ధ్యాస ఉండదు. బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకునేంత వయసు కాదది. అలాంటిది ఆ వయసులో పెళ్లి అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. బాల్య వివాహాల సంప్రదాయం ఒకప్పుడు ఉన్నా ఇప్పుడు లేదు. కానీ ఒక చోట సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తోంది. వివాహ వయసును 18 నుంచి 9కి తగ్గించాలని చూస్తోంది. వివాదాస్పదంగా మారిన అంశం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..ఇదే తొలిసారి కాదు మహిళల వివాహ వయసును తగ్గించాలని ఇరాన్ ప్రభుత్వం డిసైడ్ అయిందని తెలుస్తోంది. స్త్రీల వివాహ వయసును 18 నుంచి 9కి తగ్గించాలని భావిస్తోందని సమాచారం. తొమ్మిదేళ్ల వయసు ఉన్న బాలికలను పురుషులు మ్యారేజ్ చేసుకునేందుకు వీలు కల్పించే చట్టాన్ని సవరించడానికి ఆ దేశ గవర్నమెంట్ పూనుకుందని వినిపిస్తోంది. త్వరలో దీన్ని సవరించి, అమల్లో పెట్టేందుకు సిద్ధమైందట. వివాహ చట్టాన్ని తారుమారు చేసేందుకు అక్కడి సంప్రదాయ షియా ముస్లిం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి. 188 చట్టంగా పిలిచే దీన్ని 1959లో ప్రవేశపెట్టారు. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాన్ని ఇరాక్‌లోని షియా పార్టీలు సవరించాలనుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయి.అన్ని హక్కులు హుళక్కు 2014, 2017లో ఈ వివాహ చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నించి షియా పార్టీలు విఫలమయ్యాయి. ఒకవేళ ఈ చట్టాన్ని గనుక సవరిస్తే ఆ దేశంలోని మహిళలకు ఉన్న ముఖ్యమైన హక్కులన్నీ తొలగిపోతాయని అక్కడి ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. విడాకుల దగ్గర నుంచి పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కుల వరకు చాలా కోల్పోతామని ఆ దేశ మహిళలు టెన్షన్ పడుతున్నారు. ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురాలంటే ముందుగా అక్కడి పార్లమెంట్‌లో అధికారికంగా చర్చించాలి. ఆ తర్వాత ఓటింగ్ జరగాలి. కాగా, ఈ చట్టంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాలికల అత్యాచారాలను చట్టబద్దం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇరాక్‌లో బాల్య వివాహాల రేటు దాదాపు 28 శాతంగా ఉందని, దాన్ని మరింత పెంచేందుకే సర్కారు ఈ పనికి ఒడిగట్టిందని సీరియస్ అవుతున్నారు.