కర్నూలు జిల్లాలో యురేనియమ్ తవ్వకాలపై విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు అనుమతి ఇస్తే.. ప్రస్తుత అదోని బీజేపీ ఎమ్మెల్యే అసత్యాలు చెబుతూ.. ఆ తవ్వకాలకు గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని నిందిస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరుపాక్షి ఆక్షేపించారు. ఆ మేరకు టీడీపీ ప్రభుత్వం 2015, జూన్ 23న జారీ చేసిన జీఓ చూపిన ఆయన, యురేనియమ్ తవ్వకాలను ఎవరు, ఎప్పుడు ప్రారంభించారన్నది కావాలంటే క్షేత్రస్థాయిలో చూపిస్తానని వెల్లడించారు. మీడియా ప్రతినిధులు వస్తానంటే స్వయంగా తన కారులో తీసుకెళ్లి స్థానిక ప్రజలతోనే మాట్లాడిస్తానని చెప్పారు. ఇంకా కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసి అన్ని పార్టీల నాయకులతో కలిసి యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతాలకు వెళ్దామని సవాల్ చేశారు.
యురేనియం తవ్వకాలను అడ్డుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ దాదాపు 150 మందిపై కేసులు నమోదు చేశారని, దీంతో గ్రామస్తులంతా తిరగబడితే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విరూపాక్షి తెలిపారు. యురేనియం తవ్వకాలు జరిగితే నాలుగు నియోజకవర్గాలు.. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు పరిధిలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అక్కడ ఎప్పటికీ యురేనియమ్ తవ్వకాలు అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఉంటే యురేనియమ్ తవ్వకాలపై నాడు జారీ చేసిన జీఓ వెంటనే ఉపసంహరించాలని ఎమ్మెల్యే విరూపాక్షి కోరారు.