గత ప్రభుత్వ హయాంలో తమను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై పోలీస్ కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో బుధవారం ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల్లో పోలీస్‌స్టేషన్‌కు ఆమె చేరుకున్నారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డితోపాటు పలువురిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. సోషల్ మీడియాలో వర్రా రవీందర్ రెడ్డి.. తనపై పెట్టిన పోస్టులపై గతంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సునీతరెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే వైఎస్ సునీత చేసిన ఈ ఫిర్యాదుపై గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు వర్రా రవీందర్ రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల విచారణలో అతడు కీలక విషయాలను బహిర్గతం చేశాడు. వైఎస్ సునీత, వైఎస్ షర్మిల, వైఎస్ విజయలక్ష్మిలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ద్వారా తనకు అందిన కంటెంట్‌నే తాను పోస్టు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అతడు తెలిపారు. ఈ నేపథ్యంలో పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేయాలని వైఎస్ సునీత నిర్ణయించారు.