ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత 11 డీఎస్సీలు వేశారని.. లక్షా 50 వేల మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. ఇందులో 9 డీఎస్సీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినవే అని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీ వేశారని.. దానిలో భాగంగా టెట్ తరువాత డీఎస్సీ వెయాలని నిర్ణయించామన్నారు. డీఎస్సీకి త్వరలోనే నోటిఫికేషన్ 16 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువత పోరాటం మూలంగానే 93 శాతం విజయాన్ని అందుకున్నామన్నారు.
సూపర్ సిక్స్ మ్యానిఫెస్టోలో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు అని.. దానికి ఉన్న మంత్రి వర్గ ఉపసంఘంకు తనను ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారని తెలిపారు. డీఎస్సీ పై గతంలో ఎన్ని కేసులు పడ్డాయో వాటిని స్టడీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అధికారులు తగినంత సమయం కావాలని అడిగారన్నారు. ఇప్పడు ఇచ్చే నోటిఫికేషన్ పకడ్బందీగా వేయాలని వారికి చెప్పామని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వచ్చే ఏడాది భర్తీచేస్తామని ప్రశ్నోత్తరాలు సందర్భంగా మంత్రి లోకేస్ సమాధానం ఇచ్చారు.