అధికారంలోకి రాగానే ఉద్యోగులకు అన్నీ చేస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు..బడ్జెట్‌లో మొండిచేయి చూపారని వైయస్‌ఆర్‌సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఉద్యోగులు, పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.... ఉద్యోగులు, పెన్షనర్లకు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే మొండిచేయి చూపించినట్టే అనిపిస్తుంది. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు, జీపీఎఫ్ లాంటివి దాదాపు రూ.25 వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి. వెంటనే అవన్నీ చెల్లించాలి.
రెండు డీఏ బకాయిలు, జీపీఎఫ్, సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ బకాయిల వంటివి ఉద్కోగులు, పెన్షనర్స్‌కు రావాల్సి ఉంది. వాటిని కూటమి ప్రభుత్వం తక్షణం అమలు చేయాలి. జూన్ 1, 2023 నుంచి రావాల్సిన పీఆర్సీని 30 శాతం తగ్గకుండా అమలు చేయాలి. దసరా, దీపావళి సందర్భంగా డీఏ లేదా ఐఆర్ వస్తుందని ఉద్యోగులు ఎదురు చూశారు. కానీ నెరవేరలేదు. వైఎస్ జగన్ హయాంలో మధ్యంతర భృతి 27 శాతం అమలు చేశారు. అందుకే కూటమి నాయకులు కూడా మాట నిలబెట్టుకుంటూ, 27 శాతం తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలి. పెన్షనర్స్ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దాని గురించి ఇంతవరకు ప్రభుత్వం మాట్లాడటం లేదు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేనిపక్షంలో నిరుద్యోగ భృతి నెలకు రూ. 3 వేలు ఇస్తామని చెప్పిన హామీని తక్షణం అమలు చేయాలి. హామీ ఇచ్చినట్టుగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీదనే ఉంది. లక్ష మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డుపాలు కాకుండా కాపాడాలి అని డిమాండ్ చేసారు.