చంద్రబాబు ఒక అథముడు, మోసకారి అంటూ వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు దిట్ట అని ధ్వజమెత్తారు. తిరుపతిలోని తన నివాసంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కారణంతో వారి వైఫల్యాలు ప్రజలకు తెలుస్తాయన్న భయంతో కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఇప్పటికే 600 మందికిపైగా పైగా కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. దాదాపు 147 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి వేధించారు. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి వైయస్ షర్మిల, విజయమ్మ మీద ఐ–టీడీపీ కార్యకర్తలే నీచమైన పోస్టులు పెట్టారని తెలిసి, అతణ్ని పోలీసులు అరెస్టు చేశారని తెలిసి కూడా, తన తల్లిపై జగనే పెట్టించాడని అసెంబ్లీలో చంద్రబాబు నీతిబాహ్యమైన వ్యాఖ్యలు చేశాడు.
చంద్రబాబు చేతుల్లో ఉన్న ప్రచార సాధనాలను చూసుకుని ఆయన మిడిసి పడుతున్నాడు. తప్పును కూడా ఒప్పు చేయొచ్చని, రాష్ట్ర అప్పుల విషయంలో ఇన్నాళ్లు అదే చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చానని విర్రవీగిపోతున్నాడు. జనసేన, బీజేపీ అధ్యక్షులుగా ఉన్న తనవారితో రాష్ట్ర అప్పులపై గోబెల్స్ ప్రచారం చేయించి విడతల వారీగా అప్పులను పెంచుకుంటూ పోయిన చంద్రబాబు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్‌తో అవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. రాష్ట్ర అప్పులు రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వమే అంగీకరించింది. ఇప్పటికైనా నిజాలు మాట్లాడటం నేర్చుకో చంద్రబాబు అని హితువు పలికారు.