ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ నవనీత్ రాణాపై కొందరు దాడికి యత్నించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా దరియాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఖల్లార్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఖల్లార్ లో ఎన్నికల ప్రచారసభలో ప్రసంగించిన అనంతరం వేదికపై నుంచి కిందకు రాగానే తనపై కుర్చీలు విసిరేందుకు కొందరు యత్నించారని మండిపడ్డారు. ప్రచారసభ జరుగుతుండగా కొందరు అరుస్తూ గందరగోళం సృష్టించారని తెలిపారు. వారంతా ఒక మతానికి సంబంధించిన నినాదాలు చేశారని దుయ్యబట్టారు. తనను దూషించారని, కొందరు తనపై ఉమ్మివేశారని తెలిపారు. తన గన్ మన్లు తనను కాపాడి అక్కడి నుంచి తీసుకువచ్చారని చెప్పారు.