తాను పేరు కోసం ప్రయత్నించి ఓడిపోయానని, అందరూ నన్ను ఆహా ఓహో అని పొగుడుతుంటే అన్నీ బాగా చేస్తున్నానేమోనని భ్రమపడి.. ప్రజలను వదిలి ముందుకెళ్లడం మొదలుపెట్టానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ పత్రిక వందేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా 2004, 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి తాను పేరు కోసం ప్రయత్నించడమే కారణమని చెప్పారు. అందరూ నన్ను పొగుడుతుంటే అన్నీ బాగా చేస్తున్నానేమోనని భావించానని, దానివల్ల ప్రజలను వదిలి ముందుకెళ్లడం మొదలుపెట్టానని అన్నారు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలా చేయకుండా ప్రజలను ఎప్పుడూ తనవెంట తీసుకెళుతూ పనిచేస్తున్నారని చెప్పారు.
‘‘నేను తొలిసారి 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాను.. దీనికి నాలుగేళ్ల ముందు 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. 90వ దశకం తొలినాళ్లలో ఇంటర్‌నెట్ విప్లవం మొదలైంది.. ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరచడానికి నేను వాటన్నింటినీ ఉపయోగించడం మొదలుపెట్టాను. 1995లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయానికి పలు ఆర్థిక, ఇతర సమస్యలు ఉన్నాయి.. అప్పుడు ప్రజలతో నేరుగా మాట్లాడి వారిని చైతన్యపరిచేందుకు ప్రయత్నించాను.. కొత్త విధానాలు అవలంభించడంతో పాటు వాటి ప్రభావం గురించి నిరంతరం ప్రజలకు వివరించాను.. విభిన్న కార్యక్రమాల ద్వారా ప్రజలను నేరుగా కలుసుకోవడంతో ల్ల 1999లో వరసగా రెండోసారి విజయం సాధించాను..
నేను పేరు కోసం ప్రయత్నించినప్పుడు ఓడిపోయాను.. అందరూ నన్ను పొగుడుతుంటే అన్నీ బాగా చేస్తున్నానేమోనని అనుకొనేవాడ్ని. దానివల్ల ప్రజలను వదిలి ముందుకెళ్లడం మొదలుపెట్టాను. ప్రధాని మోదీ అలా చేయకుండా ఎప్పుడూ తనవెంట ప్రజలను తీసుకెళుతూ పనిచేస్తున్నారు. 2004, 2019ల్లో నేను అది విస్మరించాను.. అలా చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండి అభివృద్ధి కొనసాగేది. కానీ ఇప్పుడు చాలా స్పష్టతతో ఉన్నా. ప్రజలను నా వెంట తీసుకెళ్తూ అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తే ప్రజాక్షేత్రంల ఉత్తమ పనులు చేయగలనని భావిస్తున్నా. ఇప్పుడు అదే చేస్తా’ అని అని చంద్రబాబు అన్నారు.
అంతేకాదు, దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పిన చంద్రబాబు.. మోదీ 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించారని, దేశ ప్రయోజనాల కోసం ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ముందుకెళతామని స్పష్టం చేశారు. అలాగే, మరోసారి జనాభా నిర్వహణ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొనే తాను జనాభా నిర్వహణ గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. దేశంలో సంతాన సాఫల్య నిష్పత్తిని 2.1 స్థాయిలో ఉంచగలిగితే భవిష్యత్తులో భారతీయులు కార్పొరేట్ రంగాన్ని శాసించడం తథ్యమని పేర్కొన్నారు.
పూర్తిగా పేదరికం లేకుండా చేయడం, పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన, మానవ వనరుల నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, వాన నీటి సంరక్షణ, వ్యవసాయంపై దృష్టి, . అధికంగా ఉన్న రవాణా ఛార్జీల తగ్గింపు, హరిత ఇంధన వినియోగం, అత్యుత్తమ ప్రమాణాలతో ఉత్పత్తుల తయారీ, స్వచ్ఛభారత్, నిత్యజీవితంలో సాంకేతిక పరిజ్ఞానం లోతైన వినియోగమే తన ప్రాధాన్యాలని చంద్రబాబు వెల్లడించారు. ఈ పది సూత్రాలతో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ 1 రాష్ట్రంగా, భవిష్యత్తులో తెలుగువారు ప్రపంచంలో అతిపెద్ద కమ్యూనిటీగా అవతరిస్తారని చెప్పారు.