తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన నటి కస్తూరికి ఎగ్మోర్ కోర్డు రిమాండ్ విధించింది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో కస్తూరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆదివారం ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు ముందు కస్తూరిని హాజరుపరిచారు. అనంతరం నటి కస్తూరికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కస్తూరి నవంబర్ 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉండనున్నారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు కస్తూరిని చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
మరోవైపు నవంబర్ మూడో తేదీ చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో స్థిరపడిన తెలుగు ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై పలు తెలుగు సంఘాలతో పాటుగా పలువురు ప్రముఖులు సైతం మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఎగ్మోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మనోభావాలు దెబ్బతీసేలా కస్తూరి వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎగ్మోర్ పోలీసులు నటి కస్తూరి మీద నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే నోటీసులు ఇవ్వడానికి పోలీసులు కస్తూరి నివాసానికి వెళ్తే.. ఆమె కనిపించకుండా పోయారు. ఇళ్లు తాళం వేసి ఉండటంతో పాటుగా కస్తూరి ఫోన్ స్విఛాప్ రావటంతో ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందంతో కస్తూరి కోసం గాలించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కస్తూరి ఉన్నట్లు ఎగ్మోర్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు.. శనివారం సాయంత్రం ఆమెను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఇవాళ ఎగ్మోర్ కోర్టు ఎదుట హాజరు పరచగా.. న్యాయస్థానం కస్తూరికి 12 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కస్తూరిని కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలీసులు చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.