దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో సింహాచలం అప్పన్న ఆలయం ఒకటి. తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తర్వాత అత్యధిక ఆదాయం పొందే ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా ఉందంటే అది సింహాద్రి అప్పన్న దేవాలయమే. విశాఖపట్నానికి 11 కి.మీ.దూరంలో తూర్పు కనుమల్లో సింహగిరి పర్వతంపై కొలువైన సింహాచలం అప్పన్న.. ఉత్తరాంధ్రవాసులకు ఇష్టదైవం. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సింహాచలం అప్పన్న ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. గిరి ప్రదక్షిణ సమయంలో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది.
విషయంలోకి వస్తే.. సింహాచలం అప్పన్న ఆలయానికి మరో తీపికబురు అందింది. న్యాయ వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి సింహాచలం దేవస్థానానికి ఇటీవల వరుస విజయాలు దక్కుతున్నాయి. ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో 100 ఎకరాల స్థలాన్ని సింహాచలం దేవస్థానం ఇటీవల స్వాధీనం చేసుకుంది. అయితే ఇది జరిగి 24 గంటలు గడవకముందే ఇప్పుడు మరోచోట రూ.70 కోట్ల విలువైన భూములను సింహాచలం దేవస్థానం స్వాధీనం చేసుకుంది. విశాఖపట్నం సీతమ్మధారలో ఓ చోట పది ఎకరాలు, మరోచోట 4,460 చదరపు గజాలను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఆయా భూముల్లో సింహాచలం దేవస్థానం బోర్డులు కూడా పాతింది.
సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు చెప్పిన వివరాల ప్రకారం.. సీతమ్మధారలో దేవస్థానానికి చెందిన సుమారు పది ఎకరాల స్థలాన్ని ఒక సొసైటీ తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అలాగే 275 సర్వే నంబర్‌లో 4,460 చదరపు గజాల స్థలాన్ని మరికొంతమంది ఆక్రమించారు. ఈ నేపథ్యంలో ఈ భూములపై 2014 నుంచి హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే దేవస్థానం వాదనలతో ఏకీభవించిన హైకోర్టు సెప్టెంబర్‌లో కేసులను కొట్టివేసింది. ఈ క్రమంలోనే ఆయా భూములను సింహాచలం దేవస్థానం స్వాధీనం చేసుకుంటూ వస్తోంది. తాజాగా శనివారం సీతమ్మధారలో స్వాధీనం చేసుకున్న 10 ఎకరాలు, అలాగే 4460 చదరపు గజాల స్థలం విలువ రూ.70 కోట్ల వరకూ ఉండొచ్చని ఈవో త్రినాథరావు వెల్లడించారు. సింహాచలం దేవస్థానం భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈవో త్రినాథరావు హెచ్చరించారు.