శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల మకరువిళక్కు పూజలు ప్రారంభం కాగా.. స్వామి దర్శనాల కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులను ఒకే వేదికపై తీసుకొచ్చి మహా సంగమం నిర్వహించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్లాన్ చేసింది. అయ్యప్ప సంగమం పేరుతో భక్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలని నిర్ణయించింది. విదేశాల్లో నివసిస్తోన్న మలయాళీలు సహా దాదాపు 100 దేశాలకు చెందిన ప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలని యోచిస్తోంది. అలాగే, 2018 వరదలు, ఆ తర్వాత కోవిడ్-19 వ్యాప్తి వంటి కారణాలతో నిలిచిపోయిన పంపా సంగమాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది.
దేవస్థానం బోర్డు నిర్వహించే అంతర్జాతీయ అయ్యప్ప సంగమానికి సహకారం అందించేందుకు సింగ్‌పూర్‌కు చెందిన భక్త బృందం సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే 25 దేశాల ప్రతినిధుల పేర్లతో కూడి జాబితాను వారు ఇప్పటికే టీడీబీకి సమర్పించారు. శబరిమల ఆలయ విశిష్టతలను ప్రపంచ సమాజానికి చాటిచెప్పేందుకు ఇలాంటి సభ నిర్వహించడం దోహదపడుతుందని దేవస్థానం బోర్డు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ భక్తుల భాగస్వామ్యం శబరిమల అభివృద్ధికి దోహదపడుతుందని వారు అన్నారు.
రామన్ భట్టతిరిపాడ్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పంపా ఆంజనేయ ఆడిటోరియంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం పంపా సంగమం మొదట ప్రారంభమైంది. అనంతరం ఇది మకరవిళక్కుకు ముందు రోజుల్లో జరిగే మహాసమ్మేళంగా పరిణామం చెందింది. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య, చలనచిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనేవారు. కానీ, 2018 నుంచి ఈ సంగమం జరగడం లేదు. ఈ ఏడాది వరదలు, తర్వాత కరోనా వైరస్ వ్యాప్తితో ఆరేళ్ల నుంచి నిర్వహించలేదు.ఈ ఏడాది పంపా సంగమం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తదుపరి దేవస్థానం బోర్డు సమావేశంలో దీనిపై చర్చించి, నిర్ణయం తీసుకుంటారు. కాగా, సన్నిధానంలోని అన్నదానం హాలులో ఒకేసారి 2 వేల మంది భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే, అర గంటలోనే భక్తులకు అన్నప్రసాదం వితరణ చేసే సౌకర్యం కల్పించినట్టు టీడీబీ తెలిపింది.