ఉద్యోగం చేస్తోన్న భార్యను రాజీనామా చేసి.. తనకు నచ్చినట్టు జీవించాలని భర్త బలవంతం చేయడం క్రూరత్వమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తాను ఉద్యోగం సంపాదించే వరకూ ఆమెను కూడా ఉద్యోగం చేయవద్దని, తన కోరిక ప్రకారం జీవించమని భర్త తన భార్యను బలవంతం చేయడం క్రూరత్వానికి సమానమని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ ధర్మాసనం పేర్కొంది. అలా చేయడం ద్వారా భర్త లేదా భార్య కలిసి జీవించాలనుకుంటున్నారా? లేదా? అనేది వారి ఇష్టమని కోర్టు నొక్కిచెప్పింది. అయితే, జీవిత భాగస్వామి ఎంపిక ప్రకారం ఉద్యోగం చేయమని లేదా చేయవద్దని మరొకరిని బలవంతం చేయలేరని ఉద్ఘాటించింది.
కేసు వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన జంటకు 2014 ఏప్రిల్‌లో వివాహం జరిగింది. పెళ్లికి ముందే వీరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ వైవాహిక బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సదరు భార్య 2017లో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి ఎంపికయ్యింది. భర్త మాత్రం ఖాళీగానే ఉన్నాడు. భార్య సంపాదించడం.. తనకు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో అతడు చిన్నతనంగా భావించాడు. అందుకే తాను ఏదో ఒక ఉద్యోగంలో చేరే వరకూ ఆమె కూడా ఇంటి దగ్గరే ఉండాలని ఆదేశించాడు.
ఇందుకు ఆమె అంగీకరించపోవడంతో ఇరువురి మధ్య విబేధాలు మొదలయ్యాయి. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె చివరకు విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కుటుంబన్యాయస్థానం భర్తకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఆమె హైకోర్టు ఇండోర్ ధర్మాసనంలో ఈ తీర్పును సవాల్ చేయగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ సుశ్రుత్ ధర్మాధికారిల ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణ వచ్చింది. జనవరి 2020లో కుటుంబ న్యాయస్థానంలో వైవాహిక హక్కుల పునరుద్ధరణ కోసం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 కింద భర్త పిటిషన్‌ను దాఖలు చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘భార్య దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టివేసిన తర్వాత.. భర్త 2022 అక్టోబరు 20 సెక్షన్ 9 పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం కూడా వివాదాస్పదంగా లేదు. భర్త లేదా భార్య కలిసి జీవించాలనుకుంటున్నారా? అది వారి ఇష్టం... భర్త లేదా భార్య బలవంతం చేయలేరు. మరోవైపు, జీవిత భాగస్వామి ఇష్టానికి వ్యతిరేకంగా ఏ ఉద్యోగం చేయకూడదని,భార్యను ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేయమని ఒత్తిడి చేశారు.. ఉద్యోగం వదలి బలవంతంగా తనకు అనుగుణంగా జీవించాలని చెప్పడం క్రూరత్వానికి సమానం’ అని ధర్మాసనం పేర్కొంది.
తన భర్త ప్రవర్తన, వైవాహిక జీవితంలో సానుకూలత లేకపోవడం, విభేదాలే విడాకులకు కారణమని భార్య వాదించింది. ఈ సందర్భంగా కుటుంబ న్యాయస్థానం తీర్పును ధర్మాసనం తప్పుబట్టింది. ఉద్యోగం మాత్రమే కాకుండా అనుకూలత సమస్య కారణంగా భార్య పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దాఖలు చేసిందని పేర్కొంది. అంతేకాకుండా, అప్పీలుదారు విడాకులు తీసుకోవడాన్ని ప్రతివాది కోరుకోకపోవడం క్రూరత్వానికి సమానమని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఆమెకు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.