గత అక్టోబర్ నెల పండగల సీజన్లో దాదాపు అన్ని కార్ల కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. దీంతో సేల్స్ పెరిగాయి. అయితే, ఆ తర్వాత కొన్ని కంపెనీలు ఆఫర్లను ఎత్తేశాయి. పండగ సీజన్‌లో సేల్స్ పెరిగినప్పటికీ అనుకున్న స్థాయిలో స్పందన రాకపోవడంతో కొన్ని సంస్థలు ఈ నవంబర్ నెలలోనూ ఆఫర్లు కొనసాగిస్తున్నాయి. తమ కంపెనీకి చెందిన వివిధ మోడళ్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ వంటివి ఈనెలాఖరు వరకు కొనసాగిస్తున్నాయి. అందులో ఒకటే కియా మోటార్స్ ఇండియా. తమ కంపెనీకి చెందిన మూడు ఫేమస్ కార్లపై భారీగా తగ్గింపు ఇస్తోంది. ఆ మోడళ్లపై గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.
కియా సెల్టోస్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ కారను 2024, ఏప్రిల్ 1వ తేదీన భారత్‌లో లాంచ్ చేసింది కియా ఇండియా. ఇప్పుడు ఈ కారుపై భారీ రాయితీ కల్పిస్తోంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.10.90 లక్షల నుంచి రూ.20.45 లక్షలుగా ఉంది. కియా సెల్టోస్ కార్లపై కోయంబత్తూర్, పొల్లాచి, ఊటీలో ఈ ప్రత్యేక ఆఫర్ పొందవచ్చు. కియా సెల్టోస్ HTX ప్లస్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.1.99 లక్షలు, రూ.2 లక్షల డిస్కౌంట్ పొందవచ్చు. ఇక HTX iMT డీజిల్ వేరియంట్‌పై రూ.1.94 లక్షల డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే HTK ప్లస్ iMT డీజిల్ వేరియంట్‌పై రూ.1.87 లక్షల రాయితీ ఇస్తోంది.
ఇక కియా కేరెన్స్ మోడల్ కార్లపైన గరిష్ఠంగా రూ.95 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ వంటివి కలిసి ఉంటాయి. కేరెన్స్ MPV కారుపై గరిష్ఠ డిస్కౌంట్ లభిస్తోంది. లగ్జరీ ప్లస్ 7 గ్రేడ్ పెట్రోల్ ఇండియన్ iMT గేర్ బాక్స్ కారుపై రూ.90,905 డిస్కౌంట్ లభిస్తోంది. ఇక లగ్జరీ 7 పెట్రోల్ వేరియంట్ iMT కారుపై రూ.88 వేల డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఎంట్రీ లెవెల్ ప్రీమియం 7 పెట్రోల్ iMT కారుపై రూ.52 వేల డిస్కౌంట్ ఇస్తోంది.
కియా సోనెట్ మోడల్ కార్లపై గరిష్ఠంగా రూ.55 వేల డిస్కౌంట్ లభిస్తోంది. 1.2 లీటర్ పెట్రోల్ MT HTK ప్లస్ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.50 వేల డిస్కౌంట్ ఇస్తోంది. ఇక డీజిల్ వేరియంట్ అయితే రూ.55 వేల డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్ లైన్ ఏటీ డీజిల్ వేరియంట్ పైనా రూ.55 వేల తగ్గింపు లభిస్తోంది. HTEప్లస్ ఎంటీ డీజిల్ ట్రిమ్ వేరియంట్ పై రూ.50 వేల తగ్గింపు అందిస్తోంది.