ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నానమ్మకు ప్రేమతో.. ‘ఆపిల్‌’నే బురిడీ కొట్టించిన స్నేహితులు.. ఏం తెలివి గురూ

national |  Suryaa Desk  | Published : Sun, Nov 17, 2024, 08:47 PM

ఆపిల్ సంస్థ తయారు చేసే ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉంటుందో తెలిసిందే. ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఎయిర్‌ప్యాడ్లు లాంటి ఆపిల్ ప్రొడక్ట్‌లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. టెక్నాలజీ, ఫీచర్లు, బిల్ట్ క్వాలిటీ.. ఎలా చూసుకున్నా ఆపిల్ ప్రొడక్ట్స్ అద్భుతంగా ఉంటాయి. మనం ఖర్చు చేసే ప్రతి రూపాయికి సరిపడా సంతృప్తిని అవి అందిస్తాయి. ఆపిల్ సంస్థ ఇటీవల ఎయిర్‌‌పాడ్స్‌లో హియరింగ్ ఎయిడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినికిడి లోపం ఉన్నవారు ఎయిర్ పాడ్స్ హియరింగ్ ఎయిడ్‌లా (చెవిటి మెషీన్)లా ఉపయోగించొచ్చు.


 మార్కెట్లో అందుబాటులో ఉన్న చెవిటి మెషీన్లతో పోలిస్తే.. ఎయిర్ పాడ్స్‌‌ను వాడటం ఈజీ. ఎయిర్‌పాడ్స్ స్టయిలిష్‌గా ఉంటాయి కాబట్టి.. దాన్ని వాడే వారికి వినికిడి సమస్యలు ఉన్నాయనే విషయం బయటి వారికెవరికీ తెలియదు. దీంతో ఎయిర్‌పాడ్స్ వాడేందుకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తు్న్నారు. బెంగళూరుకు చెందిన రిత్విక్ జయసింహ అనే యువకుడు సైతం వాళ్ల నానమ్మ కోసం ఎయిర్‌పాడ్స్ ప్రో 2ను కొనుగోలు చేశాడు.


ఎయిర్‌పాడ్స్‌ను ఇంటికి తీసుకొచ్చిన జయసింహ.. హియరింగ్ ఎయిడ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కుదర్లేదు. ఆ రోజంతా ప్రయత్నించినా సరే అతడు సక్సెస్ కాలేకపోయాడు. ఎయిర్ పాడ్స్‌లో హియరింగ్ ఎయిడ్ ఫీచర్‌కు సెప్టెంబర్లో అమెరికా అనుమతి ఇచ్చింది. దీంతో వందకుపైగా దేశాల్లో ఈ ఫీచర్‌కు అనుమతిచ్చారు. అయితే ఇండియా సహా కొన్ని దేశాల్లో మాత్రమే ఈ ఫీచర్‌కు అనుమతి ఇవ్వలేదని తెలుసుకున్న జయసింహా.. ఎలాగైనా సరే ఈ సమస్యకు ఓ పరిష్కారం కనిపెట్టాలని అనుకున్నాడు. మరుసటి రోజు తన స్కూల్ మేట్స్ అయిన అర్నవ్ బన్సాల్, రిత్విక్ రిభూను కలిసి జరిగింది చెప్పాడు. అప్పటికే వాళ్ల నానమ్మలు కూడా హియరింగ్ ఎయిడ్ పరికరాలు ఉపయోగిస్తున్నారు.


దీంతో కోరమంగళలోని తమ ల్యాబ్‌లో ఈ ముగ్గురు మిత్రులు కలిసి.. ఎయిర్‌పాడ్స్‌లో హియరింగ్ ఎయిడ్ ఫీచర్‌ను అన్‌‌బ్లాక్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ఫీచర్ అమెరికాలో వాడుకలో ఉండటంతో.. ఎయిర్‌పాడ్స్‌ను వాడుతున్నది ఇండియాలో కాదు అమెరికాలో అని అందులోని ఆపరేటింగ్ సిస్టమ్ భావించేలా చేయాలని అనుకున్నారు.


లొకేషన్‌ను గుర్తించడానికి జీపీఎస్‌ను వాడతారనే సంగతి తెలిసిందే. కానీ ఎయిర్‌పాడ్స్‌లో జీపీఎస్ ఉండదు. అయితే ‘SSID’ల కోసం పరిసరాలను స్క్రాప్ చేయడం ద్వారా.. లేదా రౌటర్‌ను సెటప్ చేసినప్పుడు వైఫై నెట్‌వర్క్‌కు అటాచ్ అయిన సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్లు/పేర్ల ద్వారా ఎయిర్‌పాడ్స్‌ తాము ఉన్న లొకేషన్‌ను గుర్తిస్తాయి. ఎయిర్‌పాడ్‌లు Wi-Fi సిగ్నల్స్‌ను రీడ్ చేయకుండా బ్లాక్ చేసి.. వేరే ప్రాంత ఎస్‌ఎస్ఐడీలను వాటికి అందిస్తే.. ఎస్ఎస్ఐడీలు ఉన్న లొకేషన్‌లో పరికరం ఉన్నట్టు ఎయిర్‌పాడ్స్ ఆపరేటింగ్ సిస్టమ్ భావిస్తుందని ఆ ముగ్గురు స్నేహితులకు తెలుసు.


దీంతో ఈ ముగ్గురు మిత్రులు అల్యూమినియం ఫాయిల్, రాగి మెష్, ఒక మైక్రోవేవ్‌తో పాటు.. ఇండిగ్రేటెడ్ వైఫై, బ్లూటూత్‌తో వచ్చే ఈఎస్‌పీ 32 చిప్‌ను ఉపయోగించి ‘ఫేరడే కేజ్’ను రూపొందించారు. (విద్యుదయస్కాంత క్షేత్రాలను అడ్డుకునే ఈ కేజ్‌ను మైకెల్ ఫేరడే అనే శాస్త్రవేత్త 1836లో తొలిసారిగా తయారు చేశారు. దీంతో ఆయన పేరు మీదే దీనికి ఫెరడే కేజ్ అనే పేరు పెట్టారు. ఈ ప్రక్రియలో మైక్రోవేవ్ కీలకమైంది. Wi-Fi సిగ్నళ్ల తరహాలోనే 2.4 GHz ఫ్రీక్వెన్సీతో కూడిన విద్యుదయస్కాంత తరంగాలను ఫేరడే కేజ్ ఉపయోగిస్తుంది).


ఈ ఫేరడే కేజ్ సాయంతో ఎయిర్‌పాడ్స్ వైఫై సిగ్నళ్లను అందుకోకుండా చేయగలిగారు. ఆ తర్వాత ఓపెన్ సోర్స్ వైఫై లొకేషన్ డేటాబేస్‌ను వాడుకొని.. జియో-స్పూఫింగ్ చేశారు. ఈ ట్రిక్ ద్వారా ఎయిర్‌పాడ్స్ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్నట్టుగా ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను బోల్తా కొట్టించారు. డివైజ్ అమెరికాలో ఉందని ఆపిల్ ఓఎస్ భావించడంతో.. హియరింగ్ ఎయిడ్ ఫీచర్ ఎనేబుల్ అయ్యింది.


ఆ తర్వాత తమ నానమ్మలకు ఎయిర్‌పాడ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ‘మా నానమ్మ వాడే పాత చెవిటి మెషీన్ ప్రొఫెషనల్. అది చాలా ఖరీదైంది, కానీ పెద్దగా ఉంటుంది. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న మా నానమ్మకు దాన్ని వాడటం కష్టం కూడా’ అని బన్సాల్ చెప్పుకొచ్చాడు.


‘హియరింగ్ ఎయిడ్‌ను సర్దుబాటు చేయడానికి ఇంతకు ముందు ఆడియాలజిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇది ఓ పెద్ద ప్రహసనం. కానీ ఎయిర్ పాడ్స్ సాయంతో ఆ పనిని నేనే చాలా తేలిగ్గా చేశాను. హియరింగ్ ఎయిడ్‌లో లేని చాలా ఫీచర్లు ఎయిర్‌పాడ్స్‌లో ఉన్నాయి’ అని జయసింహా చెప్పుకొచ్చాడు.


ఎయిర్‌పాడ్స్‌లో హియరింగ్ ఎయిడ్ ఫీచర్‌‌ను అన్ బ్లాక్ చేసిన ఈ ముగ్గురు మిత్రులు.. తాము చేసిన ప్రయోగాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ఇతరులతో పంచుకున్నారు. దీంతో మాకు కూడా సాయం చేయండి అని చాలా మంది వారిని సంప్రదించారు. ఇప్పటి దాకా వాళ్లు ఎయిర్‌పాడ్స్ విషయంలో 30 మందికి సాయం చేయడం విశేషం.


ఇప్పటి వరకైతే ఆపిల్ తమను కాంటాక్ట్ చేయలేదని.. ఈ ఫీచర్‌కు త్వరలోనే మన దగ్గర అనుమతి లభిస్తు్ందని ఆశిస్తున్నామని ఈ ముగ్గురు మిత్రులు చెప్పుకొచ్చారు. లాగ్రాంజ్ పాయింట్ అని పేరు పెట్టుకున్న తమ ల్యాబ్ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం కనిపెట్టడానికి వీరు ప్రయత్నిస్తున్నారు. డెలివరీ ఏజెంట్లు వేసవిలో వడగాలుల బారి నుంచి ఉపశమనం పొందేలా.. వాటర్‌కూల్డ్ సూట్లను వీరు రూపొందించారు. పార్కిన్సన్ పేషెంట్లు తేలిగ్గా వేసుకునే దుస్తులను తయారు చేసిన ఈ స్నేహితులు.. నీటిలో, ఆహారంలో ఉండే మైక్రోప్లాస్టిక్స్‌ను గుర్తించే పరికరాలను తయారు చేసే పనిలో ఉన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com