సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే విద్యార్థినులు, హాస్టళ్లలో చదివే బాలికల భద్రత విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్ధిునుల భద్రతపై సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని సూచించిన హైకోర్టు.. హస్టళ్లలో చేపట్టాల్సిన చర్యలపై న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ‘వసతిగృహాలకు ప్రహరీలు, వాటికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి... రాకపోకలను పర్యవేక్షించాలి.. కామన్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఉంచాలి.. విద్యార్ధినుల వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది కలగకుండా చూడాలి. సీసీ కెమెరా రికార్డులను అనధికారికంగా వినియోగించకుండా చర్యలు తీసుకోవాలి. బాత్‌రూమ్‌లు, టాయ్‌లెట్‌లు శుభ్రంగా ఉంచుతూ.. తగినంత నీటిని సరఫరా చేయాలి.
హాస్టళ్లలో పనిచేసే సిబ్బంది నేపథ్యం పరిశీలించి, బాలికల భద్రతపై అవగాహన కల్పించాలి.. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా విద్యార్థినులకు శిక్షణ ఇవ్వాలి. వారితో గౌరవంగా ప్రవర్తించేలా, వేధింపులకు, దుష్ప్రవర్తనకూ తావులేకుండా సిబ్బంది విషయంలో ప్రవర్తన నియమావళిని రూపొందించాలి.. మానసిక ఆరోగ్య నిపుణులను పిల్లలకు అందుబాటులో ఉంచాలి.. పోక్సో చట్టం ప్రకారం నిందితులకు విధించే శిక్షలు, జరిమానాల వివరాలతో పోస్టర్లు వేయాలి. బాలలు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
బాలికల నుంచి అందిన ఫిర్యాదులను నిబద్ధతతో పరిశీలించి, వెంటనే చర్యలు తీసుకునే అధికారులను ఆ వ్యవస్థలో నియమించాలి. పిల్లలకు అండగా నిలిచేందుకు తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యాసంస్థల నిర్వాహకులతో ఓ వ్యవస్థను రూపొందించాలి.. వసతిగృహాల్లోని సమవస్కుల బాలికల బృందాలు ఏర్పాటుచేయాలి.. భద్రతాపరమైన చర్యలు సమర్థంగా అమలుచేస్తున్నారా?. లేదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి’ అని జస్టిస్ హరినాథ్ తీర్పులో పేర్కొన్నారు.
ఈ తీర్పు కాపీని మహిళ, శిశు సంక్షేమశాఖకు పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. సమగ్ర మార్గదర్శకాల రూపకల్పనలో జాతీయ బాలల హక్కుల కమిషన్, రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ, ఎన్‌జీవోలను భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు. హాస్టళ్లలో విద్యార్థినులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లపై ఉందని ఉద్ఘాటించారు. అనంతపురం జిల్లా గుత్తి గురుకుల పాఠశాలల్లో ఓ బాలికపై 2011లో అనుచితంగా ప్రవర్తించిన వాచ్‌మన్‌ను సర్వీసు నుంచి అధికారులు తొలగించడాన్ని సమర్థించారు. తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ ఆ వాచ్‌మన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేశారు. వసతిగృహంలో 2011 జులై 24న ఓ బాలికతో వాచ్‌మన్ శంకరయ్య అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో అతడ్ని అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. దీనినిసవాల్ చేస్తూ అతడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించిన హైకోర్టు..బాలికల భద్రతపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది.