ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పేర్లను మారుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల దగ్గర నుంచి వైద్య కళాశాలలు, సాగునీటి ప్రాజెక్టుల వరకూ వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన పలు పేర్లను టీడీపీ కూటమి సర్కారు మారుస్తోంది. ఈ క్రమంలోనే మరో మార్పు జరిగింది. తిరుపతిలో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పేరు మారింది. శ్రీనివాససేతు పేరును మారుస్తూ అఫ్కాన్ సంస్థ నిర్ణయం తీసుకుంది. శ్రీనివాస సేతు స్థానంలో గరుడ వారధిగా అధికారులు పేరును మార్చారు. అయితే గరుడ వారధి పేరు కొత్తదేమీ కాదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిందే. 2018లో గరుడ వారధి పేరుతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
అయితే 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గరుడవారధి పేరును శ్రీనివాస సేతుగా మార్చారు. గరుడ వారధి అనే పేరు సహేతుకంగా లేదనే ఉద్దేశంతో శ్రీనివాస సేతుగా మారుస్తున్నట్లు అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. శ్రీనివాస సేతు పేరును మార్చింది. గత ప్రభుత్వ హయాంలో తాము పెట్టిన గరుడ వారధి పేరును తిరిగి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా మార్చారు. తిరుపతి పట్టణ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు శ్రీనివాస సేతు పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు 2018లో గరుడ వారధి పేరిట ఈ ఫ్లైవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగ్గా.. 2019 ఫిబ్రవరిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. కరోనా కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. దీంతో నిర్మాణానికి ఐదేళ్లు పట్టింది. 6.4 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లై ఓవర్‌ను తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి నంది సర్కిల్ వరకు నిర్మించారు. ఆఫ్కాన్స్ సంస్థ ఈ ఫ్లై ఓవర్ నిర్మించింది. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పోరేషన్, టిటిడి సంయుక్తంగా ఈ ఫ్లై ఓవర్ ప్రాజెక్టును పూర్తిచేశాయి. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావటంతో తిరుమల యాత్రికులకు, తిరుపతి ప్రజలకు ట్రాఫిక్ సమస్యలకు తెరపడింది.