ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి కొడాలి నానికి షాక్.. ఏయూ లా స్టూడెంట్ ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 17, 2024, 07:01 PM

మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ నేత కొడాలి నానిపై విశాఖపట్నంలో కేసు నమోదయ్యింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆంధ్రా యూనివర్సిటీ లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఐదేళ్లుగా కొడాలి నాని పత్రికా ప్రకటనలు, అసెంబ్లీ సమావేశాలలో వాడిన భాషపై ఆమె తన ఫిర్యాదులో అభ్యంతరం తెలిపారు. అధికారిక కార్యక్రమాలలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌‌పై అవమానకరమైన రీతిలో అసభ్య పదజాలం ఉపయోగించారని, దుర్భాషలాడుతూ, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ ఆమె ఆరోపించారు.


కొడాలి నాని వ్యాఖ్యలు వారి పరువుకి నష్టం కలిగించడమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా వారి వ్యక్తిగత గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక బాధ్యతాయుతమైన మహిళగా కొడాలి నాని వ్యాఖ్యలు తనకు తీవ్ర ఆవేదన కలిగించాయని అంజన ప్రియ తెలిపారు. ఆయన తరచుగా ప్రసంగాల్లో, మీడియా వేదికలపై దుర్భాషలు ఆడారని ఆరోపించారు. బాడీ షేమింగ్, నిరాధారమైన ఆరోపణలు చేయడం వంటి చర్యల ద్వారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబంపై తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశారన్నారు.


ఒక మహిళగా, లా స్టూడెంట్‌గా ఇటువంటి అసభ్య పదజాలం వినడం, చూడటం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. ఇది సమాజంలో యువతపై ప్రతికూల ప్రభావం చూపించడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువలకు హానికరమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజా ప్రవర్తనను ప్రతికూలంగా ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అంజన పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో ఇది విద్వేషపూరిత సంస్కృతిని సృష్టించడాన్ని ప్రోత్సహిస్తుందని, ఇటువంటివి ఉపేక్షిస్తే యువత వీటినే ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉందని ఫిర్యాదులో మండిపడ్డారు.


ఇదే జరిగితే దారి తప్పిన యువత, ముఖ్యంగా మహిళలపై అభ్యంతరకరమైన భాష, అనుచిత పదజాలంతో సోషల్ మీడియాలో దూషిస్తే ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం వల్ల అపఖ్యాతి పాలైన వ్యక్తుల గౌరవాన్ని నిలబెట్టినట్లు ఉంటుందని, బహిరంగ వేదికలపై వాడే పదజాలం, అభ్యంతరకర భాషను ఎవరూ ఉపయోగించకుండా బలమైన సందేశాన్ని పోలీసులు పంపాలని ఆమె కోరారు. అంతేకాదు, విశాఖ పోలీస్ కమిషనర్ ఈ అంశంపై అత్యవసరంగా స్పందించి, అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించారు. తన ఫిర్యాదు ఆధారంగా కొడాలి నానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com