కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో కార్తీకమాసంలో వన భోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఆ ప్రకారమే ఈ ఏడాది కూడా నవంబర్ 17న కార్తీక వన భోజన మహోత్సవం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే భారీ వర్ష సూచన నేపథ్యంలో ఇప్పుడు వేదిక మార్చుకోవాల్సి వచ్చింది. సాధారణంగా పార్వేట మండపంలో తిరుమల కార్తీక వన భోజన మహాత్సవం నిర్వహిస్తారు. అందుకు తగినట్లుగానే ఈసారి కూడా పార్వేట మండపంలో కార్తీక వన భోజన మహోత్సవం నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్ణయాన్ని టీటీడీ మార్చుకుంది. ఆదివారం తిరుమలలో భారీ వర్షం కురవొచ్చన్న వాతావరణశాఖ హెచ్చరికల నడుమ కార్తీ వన భోజన మహోత్సవం వేదికను టీటీడీ మార్చింది. శ్రీవారి ఆలయం సమీపంలోని వైభవోత్సవ మండపంలో నిర్వహించనున్నారు.
కార్తీక వన భోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీవారి ఉత్సవమూర్తులను వైభవోత్సవ మండపానికి తీసుకువస్తారు. ఉదయం 11 నుంచి 12 వరకూ మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. మరోవైపు తిరుమలలో కార్తీక వన భోజన మహోత్సవం సందర్భంగా టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. శ్రీవారి అలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు.
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఛైర్మన్‌కు ఆహ్వానం
మరోవైపు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకూ జరగనున్నాయి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును ఆహ్వానించారు. టీటీడీ ఈవో శ్యామలరావు.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకి ఆహ్వానపత్రిక అందించి ఆహ్వానించారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్‌కు వివరించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు.