అదానీ సోలార్ ప్రాజెక్టు అంశాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ ఇవాళ (బుధవారం) ఉదయం ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ వేదికగా వైసీపీ అక్రమాలపై పవన్ ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడింది. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరిగింది. ఏపీకి చెందిన రూ.110 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు కర్ణాటకలో దొరికితే, వాటిని ఆ రాష్ట్రం అమ్మేసింది. అదే ఎర్రచందనం ఇతర దేశాల్లో దొరికితే తిరిగి తెప్పించుకోవచ్చు. నేపాల్ నుంచి అలాగే రప్పించాం. విదేశాల విషయంలో ట్రీటీ ఉన్నట్టు పొరుగు రాష్ట్రాల్లో లేదు. దేశ సరిహద్దు అవతల ఎర్రచందనం దొరికితే తెప్పించుకోవచ్చు కానీ, పక్క రాష్ట్రంలో దొరికితే స్వరాష్ట్రానికి చేరవేసే విధానం లేదు. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో మాట్లాడాను. సొంత రాష్ట్రానికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని కోరాను అని తెలిపారు.