2025 మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాలతో భారత క్రికెట్ జట్టు పాక్ వెళ్లబోమని చెప్పింది. హైబ్రిడ్ మోడల్‌లో అయితేనే ట్రోఫీలో టీమిండియా ఆడుతుందని బీసీసీఐ, ఐసీసీకి తేల్చి చెప్పింది. మరోవైపు, భవిష్యత్తులో భారత్ ఆతిథ్యం ఇచ్చే ఈవెంట్స్‌లో కూడా పాక్ ఆడదని, అప్పుడు కూడా హైబ్రిడ్ మోడల్ ఫాలో అవ్వాలని.. అలా అయితేనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెప్తామని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఐసీసీకి చెప్పింది. దీనికి బీసీసీఐ ఒప్పుకోలేదు. దీంతో అసలు టోర్నమెంట్ జరుగుతుందా లేదా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ ఈ బుధవారమే రిలీజ్ కానుందని న్యూస్ ఏజెన్సీ IANS రిపోర్ట్ పేర్కొంది. ఈ టోర్నమెంట్ నిర్వహణ గురించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) గత వారం దుబాయ్‌లో వరుస సమావేశాలను నిర్వహించింది. ఈ మీటింగ్స్‌లో టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలనే ఏకాభిప్రాయం కుదిరింది. కానీ తమ కండీషన్‌కు ICC, BCCI ఓకే చెప్తేనే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తామని PCB ప్రకటించింది. ఈ లెక్కన ఇండియా తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది, మిగిలిన మ్యాచ్‌లన్నీ పాకిస్థాన్‌లో జరుగుతాయి. ఒకవేళ భారత్ సెమీఫైనల్, ఫైనల్ చేరుకుంటే.. ఆ మ్యాచ్‌లను కూడా దుబాయ్‌లో నిర్వహిస్తారు.
ప్రస్తుతానికి ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై ఐసీసీ అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అయితే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. మార్చి 1న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. హైబ్రిడ్ మోడల్ వార్తలు నిజమైతే, దుబాయ్ భారత్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయంపై ఏకాభిప్రాయానికి రాకముందే, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ గురించి చర్చించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్లాన్లను ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఆమోదించాల్సి ఉంది. దీంతో ఇప్పటి వరకు షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ షెడ్యూల్‌పై ఇప్పటికే ఐసీసీ ఒక అంచనాకు వచ్చినట్టు IANS నివేదిక వెల్లడించింది. బుధవారం నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు IANS వార్తా సంస్థకు తెలిపాయి.