మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కుర్లా బస్సు ప్రమాదంలో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. డ్రైవర్‌కు బస్సు నడిపిన అనుభవం లేదని పోలీసుల విచారణలో తేలింది.అతను మొదటిసారిగా బస్సు నడిపినట్లు పోలీసులు తెలిపారు. దీనికి ముందు అతను తేలికపాటి వాహనాలు అంటే కార్-వ్యాన్‌ను నడిపేవాడు. డ్రైవర్‌ను బెస్ట్ (బృహన్‌ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్) కాంట్రాక్ట్‌పై నియమించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. డిసెంబర్ 1 నుంచి విధుల్లో ఉన్నాడు.ఎల్ వార్డు ఎదురుగా ఉన్న అంజుమ్-ఎ-ఇస్లాం స్కూల్ సమీపంలోని ఎస్‌జి బార్వే రోడ్డులో సోమవారం రాత్రి 9:50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన బస్సు అదుపు తప్పి రద్దీ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో వేగంగా వచ్చిన బస్సు పాదచారులపైకి దూసుకెళ్లింది చివరికి ఓ బిల్డింగ్ ఆర్‌సీసీ కాలమ్‌ను ఢీకొట్టడంతో బస్సు ఆగిపోయింది. అయితే భవనం సరిహద్దు గోడ కూలిపోయింది. ఇంతలో బస్సు 100 మీటర్ల పరిధిలో 40 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించగా, 49 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. అందుకే ఈ ప్రమాదం జరిగిందని వారు చర్చించుకుంటున్నారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మరికొందరు అంటున్నారు. కాగా, బస్సు డ్రైవర్‌కు పెద్ద వాహనం నడిపిన అనుభవం లేదని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ప్రభుత్వ బస్సు నడుపుతున్నాడు. డ్రైవర్‌కు అనుభవం తక్కువగా ఉండటం వల్లే ఇలా జరిగిందా లేక ప్రమాదానికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయల పాలైన డ్రైవర్‌కు చికిత్స అందించారు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
ప్రమాదానికి గురైన బస్సు నంబర్ MH-01, EM-8228 కలిగి ఉంది. కుర్లా స్టేషన్ నుండి అంధేరి వైపు వెళ్తున్న ఈ బెస్ట్ ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది.ఇతర వాహనాలను ఢీకొట్టింది. చివరికి ఓ బిల్డింగ్‌ను ఢీకొట్టి బస్సు ఆగిపోయింది. బస్సు మొత్తం 40 వాహనాలను ఢీకొట్టింది. అనంతరం ఘటనా స్థలంలో తొక్కిసలాట జరిగింది. ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.