కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతారంటూ జరుగుతోన్న ప్రచారంపై మోదీ సర్కారు స్పష్టత ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసులో మార్పుల ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కుండబద్దలుకొట్టారు. ఇదే అంశంపై లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉన్న విషయం తెలిసిందే.
యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన కోసం వివిధ కార్యక్రమాలను రూపొందించడంలో తమ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. అంతేకాదు, ఖాళీలను సమయానుకూలంగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలను ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే, రోజ్‌గార్ మేళాల ద్వారా అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, విద్యా, ఆరోగ్య రంగాల్లోని సంస్థల్లో మిషన్ మోడ్‌లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. అయితే, అందులో నిజం లేదని కేంద్ర సిబ్బంది వ్వవహారాల శాఖ మంత్రి సమాధానంతో మరోసారి నిర్దరణ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మార్చే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని లోక్‌సభలో గతేడాది ఆగస్టులోనూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 5వ వేతన సవరణ సంఘం.. 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని సిఫార్సు చేసింది. కానీ, గరిష్ట వయస్సు 60 ఏళ్లకు మించరాదని.. వయస్సుకు మించిన సర్వీసు పొడిగింపులపై పూర్తిగా నిషేధం విధించాలని పేర్కొంది. అంతేకాదు 7వ పీఆర్సీ సైతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాలని ఎలాంటి సిఫార్సులు చేయలేదు.
తాజాగా, సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి సైతం లోక్‌సభలో ఇదే తేల్చిచెప్పారు. అయితే, ఏపీ, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే. దీని వల్ల నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. రిటైర్మెంట్ వయసు పెంచడంతో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయి.. కొత్త నోటిఫికేషన్ల రావడం ఆలస్యం అవుతుంది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉండేది.