ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా చదువులపై భారత విద్యార్థుల అనాసక్తి.. 38 శాతం తగ్గిన స్టూడెంట్ వీసాలు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 08:45 PM

సాధారణంగా ఉన్నత చదువులు చదవాలనుకునే భారతీయులు.. ప్రపంచంలో ఉన్న టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే దేశం అమెరికా. అమెరికాకు ఏటా వెళ్లి చదువుకునే ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈసారి మాత్రం భారీగా తగ్గిపోవడం గమనార్హం. ఈ 2024 ఏడాదిలోనే జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య భారత్ నుంచి అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 38 శాతం తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా విదేశాంగ శాఖ లెక్కలు చెబుతున్నాయి. భారతీయ విద్యార్థులకు అమెరికా జారీ చేసే ఎఫ్-1 స్టూడెంట్ వీసాల్లో భారీగా తగ్గుదల నమోదైందని వెల్లడైంది. అయితే కరోనా మహమ్మారి వెలుగుచూసిన తర్వాత.. అమెరికా ఇచ్చ్ ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.


ప్రతీ సంవత్సరం వేలాది మంది భారతీయ విద్యార్థులు దేశం విడిచి అమెరికాకు వెళ్లి అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు అమెరికా ఇచ్చే ఎఫ్-1 స్టూడెంట్‌ వీసాలు 38 శాతం తగ్గినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ విడుదల చేసిన నెలవారీ నివేదికల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మధ్య కేవలం 64,008 మంది భారతీయ విద్యార్థులు మాత్రమే ఎఫ్‌-1 వీసాలను పొందినట్లు తెలుస్తోంది. అయితే గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల కాలంలో ఈ ఎఫ్-1 వీసాల సంఖ్య 1,03,495గా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.


అంతకుముందు 2021లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొదటి 9 నెలల్లో 65,235 మందికి ఎఫ్‌-1 స్టూడెంట్ వీసాలు దక్కాయి. ఆ తర్వాత 2022 జనవరి-సెప్టెంబరు మధ్య 93,181 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వీసాలు పొందారు. అయితే కొవిడ్‌ మహమ్మారి తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాల్లో భారీ తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి కావడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇక కేవలం భారత్ మాత్రమే కాకుండా చైనా విద్యార్థులకు అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాల సంఖ్యలో 8 శాతం తగ్గింది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 73,781 మంది చైనా స్టూడెంట్లకు అమెరికా వీసాలు అందగా.. గతేడాది 80,603లు వచ్చినట్లు లెక్కలు వెల్లడయ్యాయి.


ఇక ఎప్పటినుంచో అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల లిస్ట్‌లో చైనా అగ్రస్థానంలో ఉంటుంది. అయితే చైనాను వెనక్కి నెట్టి భారత విద్యార్థులు తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. 2023-2024 అకడమిక్ సంవత్సరం నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్‌ తొలిస్థానంలో నిలవగా.. చైనా స్టూడెంట్ల సంఖ్య 2,77,398 గా ఉన్నట్లు తేలింది. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు 11.26 లక్షల మంది ఉండగా.. వారిలో 29 శాతం మంది భారతీయులే కావడం విశేషం. ఇక ఈ ఎఫ్‌-1 వీసా అనేది నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసా. ప్రపంచంలోని ఏ దేశ స్టూడెంట్లు అయినా అమెరికాలో ఫుల్‌ టైమ్‌ చదువుకునేందుకు ఈ వీసా అనుమతిస్తుంది. అమెరికాలో ఉండే యూనివర్సిటీలో ఏటా రెండుసార్లు అడ్మిషన్లు ఇస్తూ ఉంటాయి. అయితే ఆగస్ట్- డిసెంబర్‌ సెమిస్టర్‌ సమయంలో భారతీయ స్టూడెంట్లు అధికంగా అమెరికాకు వెళ్తూ ఉంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com