మనం ఇంకాసేపట్లో చనిపోతున్నామని తెలిస్తే బాధ, భయంతో విపరీతంగా ఏడ్చేస్తుంటాం. ఏం చేయాలో తెలియక తల బద్దలు కొట్టుకుంటాం. కానీ ఆ ఆర్మీ జవాన్ మాత్రం తన ప్రాణాలు మరికొద్ది నిమిషాల్లోనే పోతాయని తెలిసినా ఏమాత్రం బెదరలేదు. తన ప్రాణాలు కాపాడుకోవాలని కూడా అనుకోలేదు. తన పక్కనే డ్యూటీలో ఉన్న మరో 30 జవాన్లను ఎలాగైనా రక్షించాలనుకున్నారు. వెంటనే తాను ల్యాండ్‌మైన్ ఉచ్చులో బిగుసుకున్నట్లు చెప్పి వారందరినీ దూరంగా పంపించారు. ఆపై ఆ ల్యాండ్‌మైన్ పేలుడుకు బలై వీరమరణం పొందారు. ఈ రియల్ హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ప్రకాషం జిల్లా రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య 20 ఏళ్ల కిందట ఆర్మీకి వెళ్లారు. ప్రస్తుతం ఆర్మీలోని 25వ రాష్ట్రీయ రైఫిల్స్‌లో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం విధి నిర్వహణలో భాగంగా 30 మంది జవాన్లతో కలిసి.. జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్లో కాపలా కాస్తున్నారు. ఈక్రమంలోనే సుబ్బయ్య అనుకోకుండా ల్యాండ్ మైన్ ఉచ్చులో పడిపోయారు. విషయం గుర్తించిన అతడు భయపడకుండా.. తన తోటి జవాన్ల ప్రాణాలు కాపాడాలనుకున్నారు. అదే విషయాన్ని వారికి చెప్పారు. అందరినీ దూరంగా వెళ్లిపోమని వివరించారు. ఆ తర్వాత ల్యాండ్‌మైన్ పేలడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు.
తోటి జవాన్ల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అధికార లాంఛనాలు పూర్తి చేసి మరీ సుబ్బయ్య మృతేదాన్ని స్వగ్రామానికి పంపించారు. మృతుడుకి భార్య లీలావతితో పాటు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలాగే తండ్రి చనిపోగా తల్లి తన భార్యతోనే ఉంటోంది. కుమారుడి మృతి విషయం తెలుసుకున్న తల్లి, భార్య, పిల్లలతో పాటు బంధువులు కూడా కన్నీరు పెట్టారు. 30 మంది ప్రాణాలు కాపాడి ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుసుకుని ఊరంతా సెల్యూట్ చేశారు. గురువారం రోజు సుబ్బయ్య అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు మృతుడి కుటుంబానికి తాము అన్ని విధలా అండగా ఉంటామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.
ఈ ఘటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించారు. రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్ అంటూ ఎక్స్ వేధికగా పోస్టు పెట్టారు. ల్యాండ్‌మైన్ ఉచ్చులో ఇరుక్కున్న సుబ్బయ్య.. 30 మంది జవాన్లను కాపాడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ‘సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, సుబ్బయ్య ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.