వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించే వారు ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలు, ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోవాలి. మర్చిపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ట్యాక్స్ పేయర్లు ఒక ఏడాదిలో చెల్లించాల్సిన పన్ను రూ.10 వేలు దాటినప్పుడు వారు అడ్వాన్స్ రూపంలో విడుతల వారిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో విడుత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల గడువు డిసెంబర్ 15, 2024తో ముగుస్తుంది. ఆలోపు మీ మూడో విడుత కట్టాల్సి ఉంటుంది. లేదంటే భారీగా పెనాల్టీలతో పాటు కొన్నిసార్లు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మరి ఈ అడ్వాన్స్ ట్యాక్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
రాబోయే ఆదాయాన్ని ముందాగనే అంచనా వేసి ముందస్తుగా చెల్లించే ట్యాక్సులనే అడ్వాన్స్ ట్యాక్సులు అంటారు. ఈ అడ్వాన్స్ ట్యాక్సులను ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. ముందస్తుగా అంచనా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను రూ.10 వేలు లేదా అంత కన్నా ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారుల, స్వయం ఉపాధి పొందే వారు ఈ కేటగిరీలోకి వస్తారు. ఉద్యోగుల విషయంలో కంపెనీలే వారి వేతనం నుంచి ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ రూపంలో ట్యాక్స్ పే చేస్తుంది. అందుకు వారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ, శాలరీ కాకుండా ఇతర ఆదాయాలు ఉన్నప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు.. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ముందస్తుంగా అంచనా వేసిన ఆదాయం రూ.10 వేల కన్నా తక్కువ ఉన్న వారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. 60 సంవత్సరాల పైబడిన ఎలాంటి వ్యాపార, వృత్తి గత ఆదాయం లేని సీనియర్ సిటిజన్లకు మినహాయింపు ఉంటుంది.
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో అందే అన్ని రకాల ఆదాయాలను అంచనా వేసి, అందులోంచి పన్ను మినహాయింపులను తీసేయాలి. ఆ తర్వాత మిగిలిన ఆదాయంపై పన్ను లెక్కగట్టాలి. ఈ విలువ రూ.10 వేలకు మించి ఉన్నప్పుడు ముందస్తు పన్ను చెల్లించాలి. ముందుగా నిర్దేశించిన తేదీల్లోపు విడతల వారీగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది జూన్ 15వ తేదీలోపు తొలి విడత కింద 15 శాతం చెల్లించాలి. రెండో విడత సెప్టెంబర్ 15వ తేదీలోపు 45 శాతం కట్టాలి. డిసెంబర్ 15వ తేదీ నాటికి 75 శాతం పన్ను చెల్లించాలి. ఇక మార్చి 15వ తేదీ నాటికి 100 శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
నిర్దేశించిన గడువులోపు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే పెనాల్టీలు పడతాయి. సెక్షన్ 234సీ ప్రకారం.. 1 శాతం వడ్డీ పెనాల్టీ వేస్తారు. సెక్షన్ 234బీ ప్రకారం.. ఆర్థిక సంవత్సరం చివరి వరకు పన్ను కట్టకపోయినా, కట్టిన 90 శాతం మించకపోయినా బకాయిలపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ పడుతుంది. సెక్షన్ 234ఏ ప్రకారం గడువు తేదీ ముగిసిన తర్వాత కడితే బకాయిలపై నెలకు 1 శాతం చొప్పున పెనాల్టీ కడ్డాలి.