కృష్ణాజిల్లా, పామర్రు మండలం, జమి గొల్వేపల్లిలో కృష్ణ మిల్క్ యూనియన్ వజ్రోత్సవ వేడుకల సన్నహక కార్యక్రమం బుధవారం జరిగింది. ఈనెల 11వ తేదీ నుంచి జరగనున్న వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పాడి రైతులను కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన రైతులతో కలిసి యూనియన్ వజ్రోత్సవ వేడుకల కేక్ కట్ చేశారు. అలాగే పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కృష్ణ మిల్క్ యూనియన్ అంకురార్పణ మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితమేనని అన్నారు.
ఇప్పుడు ఇది లాభాల బాటలో పయనిస్తోందని, రైతాంగానికి అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తుందన్నారు. పాడి రైతుల సంక్షేమం, పాడి పరిశ్రమ అభివృద్ధే యూనియన్ లక్ష్యమని అన్నారు. ఒక్క సొసైటీతో ప్రారంభమైన కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు 12 వందల సొసైటీలతో... 12 కోట్ల లీటర్ల పాలను సేకరించే స్థాయికి ఎదిగిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందిస్తూ... ముందుకు సాగుతున్న.... కృష్ణ మిల్క్ యూనియన్ వజ్రోత్సవ వేడుకల్లో పాడి రైతులందరూ పాల్గొనాలని చలసాని ఆంజనేయులు పిలుపిచ్చారు.