వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్న ప్రసాదం , తిరుమల లడ్డూలో నాణ్యత లోపించిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలకు చెక్ పడింది.అయితే, ఇటీవల తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని, ఇతర మతస్థులను టీటీడీ లో ఉన్నత ఉద్యోగాల్లో నియమించారని, మాంసాహారం, గంజాయి, మందు వంటివి కొండపై విరివిగా దొరుకుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా తిరుమల క్షేత్ర పవిత్రత దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆధ్మాత్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం చాపకింద నీరులా విస్తరిస్తోందని అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన సర్కార్, టీటీడీ ఇప్పటికే సంస్కరణలు మొదలు పెట్టింది. అన్యమతస్తును విధుల నుంచి పక్కకు తప్పించేందుకు చైర్మన్ బీఆర్ నాయుడు చాలా పట్టుదలగా ఉన్నారు.ఈ మేరకు అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ జాబితాను కూడా రూపొందిచారు. అయితే, ఆ లిస్ట్‌లో టీటీడీ (TTD)లో ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు టీటీడీలోనే పని చేసి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేసింది. మొత్తం 18 మంది ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, వివిధ విద్య సంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు, తదితరులు ఉన్నారు. తాజా సమాచారం మేరకు టీటీడీ (TTD)లో మరో 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు.