ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ క్రమంలో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా రాష్ట్రపతి భవన్‌లోని పోలింగ్ బూత్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటు వేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఆప్ అభ్యర్థి, ఢిల్లీ సీఎం అతిషి తన నివాసం నుంచి బయలుదేరి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సెంట్రల్ ఢిల్లీలోని జంగ్‌పురా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా తన భార్యతో కలిసి లేడీ ఇర్విన్ స్కూల్లో పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఓటు వేసిన తర్వాత, ఢిల్లీ ప్రజలు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.