తిరుపతి వాసులకు ముఖ్య గమనిక. స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. డిసెంబర్ నెల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 2025 జనవరి నెలకు సంబంధించిన స్థానిక దర్శన కోటా టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. జనవరి 5వ తేదీన స్థానిక దర్శన కోటా టికెట్లను జారీ చేస్తారు. అనంతరం జనవరిలో వచ్చే మొదటి మంగళవారం అయిన జనవరి 7వ తేదీన వీరికి తిరుమల దర్శనం కల్పి్స్తారు. స్థానిక దర్శన కోటా టికెట్లను ఎక్కడ జారీ చేస్తారనే వివరాల గురించి టీటీడీ ఓ ప్రకటన జారీ చేసింది.
జనవరి 5వ తేదీ ఆదివారం.. తిరుపతిలోని మహతి ఆడిటోరియం కౌంటర్లలో, తిరుమల బాలాజీ నగర్‌లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. స్థానిక దర్శన కోటా కింద.. తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయితే టికెట్ల కోసం భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకుని రావాల్సి ఉంటుంది. కౌంటర్లలో ఆధార్ కార్డును చూపించి టోకెన్లు పొందాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. మరోవైపు స్థానిక కోటా దర్శనాలకు టీటీడీ కొన్ని నిబంధనలు కూడా అమలు చేస్తోంది.
స్థానిక కోటా దర్శనాల టోకెన్ల కోసం వచ్చిన భక్తులకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ప్రాతిపదికన టోకెన్లు కేటాయిస్తారు. టోకెన్ల కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్థానిక దర్శన కోటా టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలోనూ ఒరిజినల్ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది. స్థానిక దర్శన కోటా భక్తులను ప్రతి నెలా మొదటి మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని దివ్యదర్శనం క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. ఇక తిరుమల శ్రీవారి ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగానే దర్శనం తర్వాత ఒక లడ్డూను ఉచితంగా అందిస్తారు. అయితే స్థానికుల కోటాలో ఒక్కసారి దర్శనం చేసుకున్నవారికి.. మరో 90 రోజులపాటు దర్శనానికి అనుమతి ఇవ్వరు.