ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన మార్క్ చూపించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే సమస్యలు, ఫిర్యాదులు, వినతులపై సత్వరమే స్పందించే నారా లోకేష్.. మరోసారి ఆ మాటను నిజం చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న మల్లికార్జునరెడ్డి అనే టీడీపీ కార్యకర్త, ఎన్టీఆర్ అభిమానికి నారా లోకేష్ అండగా నిలిచారు. తాను ఉన్నానంటూ భరోసా కల్పించారు.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు పట్టణానికి చెందిన కె. మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తికి ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. అన్నగారి మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా మల్లికార్జునరెడ్డి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఏడాదిక్రితం పక్షవాతం కూడా రావటంతో మల్లికార్జునరెడ్డి పరిస్థితి విషమించింది. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చడంతో చికిత్స తీసుకుని కోలుకున్నారు. అయితే నెల రోజుల క్రితం మల్లికార్జునరెడ్డికి మళ్లీ పక్షవాతం వచ్చింది. దీంతో నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చేర్పించారు. మల్లికార్జునరెడ్డికి అక్కడ ఉచితంగా వైద్యం అందించిన డాక్టర్లు.. ఇన్ఫెక్షన్ ఎక్కువ కావటంతో ఒక కాలును తొలగించారు. దీనికి తోడు పక్షవాతం కారణంగా మరో కాలుతో నడవలేని పరిస్థితి. దీంతో మల్లికార్జునరెడ్డి మంచానికే పరిమితమయ్యారు.
మల్లికార్జునరెడ్డి పరిస్థితి గురించి టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా ద్వారా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చాయి. దీంతో నారా లోకేష్ వెంటనే స్పందించారు. మల్లికార్జునరెడ్డికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చిన నారా లోకేష్.. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణకు సూచించారు. నారా లోకేష్ సూచనలతో వీడియో కాల్ ద్వారా మల్లికార్జునరెడ్డితో మాట్లాడిన నారాయణ.. అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని, త్వరలో స్వయంగా వచ్చి కలుస్తామని మాట ఇచ్చారు. దీంతో మల్లికార్జునరెడ్డి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. సాయం కోరిన వెంటనే స్పందించారంటూ కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు కార్యకర్తల నుంచి వచ్చే వినతులతో పాటుగా.. నెటిజనం నుంచి వచ్చే ఫిర్యాదులపైనా నారా లోకేష్ అంతే వేగంగా స్పందిస్తున్నారు. సమస్యలను సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేస్తూ ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేలా చర్చలు తీసుకుంటున్నారు.