ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో ఘోర ప్రమాదం.. గోడను ఢీకొని పేలిన విమానం, 181 మంది ప్రయాణికులు

international |  Suryaa Desk  | Published : Sun, Dec 29, 2024, 09:11 PM

ఇటీవల కజకిస్తాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి ఇంకా మర్చిపోకముందే అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. దక్షిణ కొరియా విమానం ఒకటి తాజాగా ప్రమాదానికి గురైంది. 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కూడిన విమానం.. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో పేలిపోయింది. అయితే విమానం ల్యాండింగ్ గేర్‌లో టెక్నికల్ సమస్య ఏర్పడటంతో.. ఎలాగైనా విమానాన్ని ల్యాండ్ చేయాలని పైలట్ భావించాడు. అయితే ఆ విమానం రన్ వే పై ఆగకుండా దూసుకెళ్లి ఎయిర్‌పోర్టు గోడను బలంగా తాకింది. అతివేగంతో వచ్చి ఆ విమానం గోడను ఢీకొట్టడంతో పేలిపోయి మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో అర్థం కాని.. ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


దక్షిణ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ విమాన ప్రమాదం జరిగింది. 181 మంది ప్రయాణికులు, విమాన సిబ్బందితో కూడిన విమానం.. రన్‌వేను దాటుకుని వెళ్లి గోడను ఢీకొట్టినట్లు దక్షిణ కొరియా మీడియా కథనాలు వెలువరిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు 62 మంది ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు ఒక మీడియా సంస్థ తెలిపింది. అయితే ఇంకా ఎంత మంది ఆ మంటలను తప్పించుకుని బయటపడ్డారు.. ఎందరికి గాయాలు అయ్యాయి అనేది ఇంకా తెలియలేదు. జెజు ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం.. బ్యాంకాక్ నుంచి మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ల్యాండ్ అయిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


ఇక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ విమానంలో గాయపడినవారు, చిక్కుకున్న వారిని బయటికి తీస్తున్నారు. మరోవైపు.. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై సదరు ఎయిర్‌లైన్ సంస్థతోపాటు అక్కడి ప్రభుత్వం విచారణ జరుపుతోంది.


ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రన్‌వే పై దిగిన విమానం వేగంగా దూసుకువచ్చి ఆగకుండా నేరుగా వెళ్లి ఎయిర్‌పోర్టు చివరన ఉండే గోడను ఢీకొట్టడం, ఆ వెంటనే ఆ విమానంలో నుంచి మంటలు బయటికి రావడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com