నూతన సంవత్సరాది వేళ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు విచ్చేశారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యేలకు దశలవారీగా కౌన్సెలింగ్ చేస్తున్నానని తెలిపారు. తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలను పదే పదే హెచ్చరిస్తున్నా అని స్పష్టం చేశారు. కొన్ని అంశాల్లో పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు, తన ఆలోచనలకు తేడా ఉంటోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, సమాజానికి హానికరమైన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అన్నారు. గతంలో రౌడీయిజం, మతకలహాలను అణచివేసినట్టే ఇప్పుడు కూడా పనిచేస్తానని తెలిపారు.2024 చరిత్ర తిరగరాసిన సంవత్సరం అని అభివర్ణించారు. గత ఐదేళ్లు ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, మీడియా కూడా ఇబ్బందులు పడిందని... ఆ ఇబ్బందుల నుంచి ఇప్పుడు విముక్తి కలిగిందని చెప్పారు. గత 6 నెలలుగా అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చిందని అన్నారు. అధికారులను కూడా గత ఐదేళ్లు బురదలోకి నెట్టారని, కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారని చంద్రబాబు వెల్లడించారు.అమరావతి గురించి మాట్లాడుతూ, ఏపీ రాజధానిగా అమరావతికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ధీమా వ్యక్తం చేశారు.