ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటున్న వేళ, రోడ్డు పక్కన నివసించే వారిని సంతోషంగా ఉంచేందుకు తమిళనాడుకు చెందిన ఉడవుం కరంగల్ సామాజిక కార్యకర్తలు చెన్నై నగరంలో స్వీట్లు, ఆహార ప్యాకెట్లను అందజేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక కార్యకర్తలు జాకబ్, షావనావాజ్ చెన్నై రెడ్‌హిల్స్ రోడ్‌లో చినిగిన దుస్తులు ధరించి ఆకలితో ఉన్న ఒక వృద్ధుడిని చూశారు. అతని వద్దకు వెళ్లి బస, ఆహారం అందిస్తాం, ఉడువుం కరంగల్‌కు వస్తావా అని అడగ్గా అతను అంగీకరించడంతో తిరువెర్కాడులోని శాంతి వనానికి తీసుకువెళ్లారు.వృద్ధుడికి స్నానం చేయించి వస్త్రాలు ఇచ్చి, భోజనం అందించారు. ఉడువుం కరంగల్ సామాజిక కార్యకర్త శ్రీనివాసరావు వృద్ధుడికి కౌన్సెలింగ్ చేసి కుటుంబ వివరాలు సేకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి సమీపంలోని యలమంచిలిలంక గ్రామానికి చెందినవాడిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 2వ తేదీన ఉడవుం కరంగల్ వ్యవస్థాపకుడు విద్యాకర్ పెద్దిరాజును అతని ఇద్దరు కుమారులు గంగాసురేష్, రమే్‌షబాబుకు అప్పగించారు.