అడిగిన ఫోన్ కొనివ్వలేదని, అమ్మా, నాన్నలు తిట్టారని, ప్రియురాలి పెళ్లికి ఒప్పుకోలేదని, ఉద్యోగం రావట్లేదని, చదువు వంటపట్టట్లేదంటూ.. అనేక మంది యువకులు క్షణికావేశంలో తమను తాము చంపుకోవడమో, తమకు కావాల్సిన వారి ప్రాణాలు తీయడమో చేస్తుంటారు. తాజాగా ఇలాంటి దారుణానికే పాల్పడ్డాడో యువకుడు. ముఖ్యంగా ఇప్పటికే మూడు సార్లు ఇంజినీరింగ్ ఫెయిల్ అయిన అతడిని ఐటీఐ చేయమని చెప్పారు తల్లిదండ్రులు. ఆమాత్రం దానికే అమ్మా, నాన్నలను హత్య చేసి.. ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి అద్భుతమైన ప్లాన్ వేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.
నాగ్‌పూర్‌కు చెందిన లీలాధర్ ఖోరడి థర్మల్ పవర్ స్టేషన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య అరుణ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. అయితే వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు పెద్దది కాగా 21 ఏళ్ల ఉత్కర్ష్ చిన్నవాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ పిల్లలిద్దరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని బాగా చదివిస్తున్నారు. అయితే కూతురు పీజీ చేస్తుండగా.. కుమారుడు మాత్రం ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్నాడు. మొదట్లో బాగానే చదివిన ఉత్కర్ష్.. ఇటీవలే ఫిజిక్స్‌లో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత రెండు సార్లు రాసినా పాస్ కాలేకపోయాడు.
ఇక ఎంత చదివినా ఫెయిల్ అవుతాడని గ్రహించిన తల్లిదండ్రులు.. అతడిని పిలిచి మాట్లాడారు. నీవు చదవలేకపోతున్నావు కాబట్టి ఐటీఐ చేసి.. ఆపై తమకు వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకోమని చెప్పారు. అది ఏమాత్రం నచ్చని ఉత్కర్ష్.. ఇంజినీరింగ్‌యే కొనసాగిస్తానని పట్టుబట్టాడు. కానీ లీలాధర్, అరుణలు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. గత కొంతకాలంగా ఇంట్లో దీనిపైనే గొడవ జరుగుతోంది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడు అయిన ఉత్కర్ష్... డిసెంబర్ 26వ తేదీ రోజు తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని బెడ్ మీద పడేసి.. ఇంట్లోనే ఉండి ఏం చేయాలో ఆలోచించాడు.
కాసేపటికి తండ్రి లీలాధర్ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన ముఖం కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్తుండగా.. వెనక నుంచి వెళ్లిన ఉత్కర్ష్.. తండ్రిపై కత్తితో దాడి చేశాడు. విషయం గుర్తించిన అతడు కుమారుడిని ఆపే ప్రయత్నం చేశాడు. మరోవైపు భార్యను పిలిచాడు. అప్పుడే ఉత్కర్ష్ అమ్మ చనిపోయిందని చెప్పాడు. తానే చంపినట్లు వివరించాడు. ఇప్పటికీ మీరు నన్ను ఐటీఐ చేయాలనే అంటారా, ఇంజినీరింగ్ చదవమంటారా అని అడగ్గా.. ఐటీఐ చేయమని లీలాధర్ చెప్పాడు. తండ్రి ఆ మాట అనగానే తీవ్ర ఆవేశానికి లోనైన ఉత్కర్ష్ మరోసారి కత్తితో పదే పదే పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఆపై తల్లిదండ్రుల ఇద్దరి మృతదేహాలను ఒకే బెడ్ మీద వేశాడు. నేరం నుంచి తప్పించుకోవడానికి సూసైడ్ నోట్ రాసి దాన్ని ఫొటోగా తీశాడు. తండ్రి ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఆపై బట్టలు మార్చుకుని ఇంటికి తాళం వేసి.. సోదరి చదువుతున్న కాలేజీ వద్దకు వెళ్లాడు. అమ్మ, నాన్నలు ఇద్దరూ 10 రోజుల పాటు మెడిటేషన్ చేసేందుకు బెంగళూరు వెళ్లారని చెప్పాడు. అలాగే వారొచ్చే వరకు తమను బంధువుల ఇంట్లో ఉండమన్నారని చెప్పి చుట్టాల ఇంటికి తీసుకు వెళ్లాడు. సోదరి మాత్రం తండ్రికి ఫోన్ చేస్తూనే ఉంది. కానీ మెడిటేషన్ చేస్తుంటే ఫోన్ వాడనివ్వరంటూ కవర్ చేశాడు ఉత్కర్ష్.
ఇలా సోదరికి మాటకో అబద్ధం చెబుతూ.. అక్కడే ఉంచాడు. కానీ జనవరి 1వ తేదీ రోజు లీలాధర్ ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో.. స్థానికులు ఏం జరిగిందో చూడాలనుకున్నారు. కిటికీలోంచి లీలాధర్ ఇంట్లోకి తొంగి చుడగా.. వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూశారు. భార్యాభర్తలు ఇద్దరూ చనిపోయి ఉండడం చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి పిల్లలిద్దరికీ సమాచారం అందించగా.. వారు ఇంటికి చేరుకున్నారు.
అక్కడే ఉత్కర్ష్ ప్రవర్తన తేడాగా ఉండడంతో పోలీసులు అతడిని తమదైన స్టైల్‌లో విచారించారు. దీంతో ఉత్కర్ష్ తానే తల్లిదండ్రులు ఇద్దరినీ చంపినట్లు ఒప్పుకున్నాడు. తమ్ముడే అమ్మా, నాన్నలను చంపినట్లు తెలుసుకున్న సోదరి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.