రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేవీ డేలో పాల్గొనేందుకు ఈనెల నాలుగో తేదీన నగరానికి రానున్నారు. శనివారం మధ్యాహ్నం 2.40 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బయలుదేరి 3.40 గంటలకు విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి 4.40 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.40 నుంచి 6.10 గంటల వరకూ నేవీ డే కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి బీచ్ నుంచి 6.15గంటలకు బయలుదేరి 6.50 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళతారు.విశాఖ సాగర తీరంలో గురువారం సాయంత్రం తూర్పు నౌకాదళం సాహస విన్యాసాల ప్రదర్శన అట్టహాసంగా జరిగింది. ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎదుట విన్యాసాల ప్రదర్శన జరగనుంది. దీనికి రిహార్సల్‌గా గురువారం సాయంత్రం అన్నిరకాల విన్యాసాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్ షో, డ్రోన్ల ప్రదర్శన నగర వాసులను అలరించాయి. ఆకాశంలో ఎగురుతున్న హెలికాప్టర్ నుంచి పారాచ్యూట్ సాయంతో కిందకు సురక్షితంగా దిగే విన్యాసం ప్రదర్శించారు. అయితే మొత్తం నలుగురిలో ఇద్దరు క్షేమంగా కిందకు రాగా, మిగిలిన ఇద్దరు పట్టు తప్పి ఒకరి పారాచ్యూట్ మరొకరి దానికి ముడిపడి సముద్రంలో పడిపోయారు. వెంటనే నేవీ సిబ్బంది జెమినీ బోట్లలో అక్కడకు వెళ్లి పారాట్రూపర్లు ఇద్దరినీ రక్షించారు.