మద్యానికి బానిసలై నిత్యం వేధించే భర్తలను సైతం భరించే భార్యలు ఎందరో. కానీ తను మాత్రం అలా భరించాలనుకోలేదు. ఎలాగైనా సరే అతడిని హత్య చేసైనా తాను బాగు పడాలనుకుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు లాగా.. భర్త హత్యతో పాటు బాగా డబ్బులు రావాలనుకుంది. ఈక్రమంలోనే ఓ అదిరిపోయే ప్లాన్ చేసింది. కట్టుకున్న వాడిని కడతేర్చిన తర్వాత 50 లక్షల రూపాయలు పొందాలనుకుని అనేక రకాల ఇన్సూరెన్స్‌లు చేయించింది. కానీ ఆమె చేసిన ఓ చిన్నతప్పుతో హత్య విషయం వెలుగులోకి వచ్చేసింది. మరి ఆమె చేసిన ఆ తప్పేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్ బన్స్వారాలోని పలోడ్రాకు చెందిన 37 ఏళ్ల కలుకు చాలా ఏళ్ల క్రితమే కాంతతో(35) పెళ్లి జరిగింది. అయితే మొదటి నుంచి కలు ఏ పనీ చేసేవాడు కాదు. అందులోనూ మద్యానికి బానిసై నిత్యం తాగొచ్చేవాడు. కాంత ఎంత చెప్పినా కలు మాత్రం తాగడం మానలేదు. అలాగే ఎలాంటి ఉద్యోగమూ వెతుక్కోలేదు. భార్యే పని చేసుకుంటూ భర్తను పోషించింది. చాలా ఏళ్లుగా ఇదే తంతు కొనసాగగా.. భర్తతో కలిసుండడం వ్యర్థం అని భావించింది. అయితే తాను విడాకులు ఇవ్వాలని అనుకోవడానికి బదులుగా... ఏడాది క్రితం నుంచే కలును చంపాలనుకుంది.
అలా ఉత్తిగా చంపేస్తే ఎలాంటి ఉపయోగమూ ఉండదని భావించిన ఆమె.. అతడిని హత్య చేస్తే ఆమె సెటిల్ అయ్యేంత డబ్బు పొందాలనుకుంది. దీంతో వెంటనే భర్త పేరుపై అనేక రకాల ఇన్సూరెన్స్ పథకాలు తీసుకుందని. ఏడాదిగా వాటిని కడుతూ వస్తోంది. సంవత్సరం దాటగానే భర్తను చంపితే డబ్బులు వస్తాయని తెలుసుకున్న కాంత.. కట్టుకున్న వాడిని కడతేర్చేందుకు మంచి ప్లాన్ వేసింది. అయితే హత్య చేసినట్లు తెలిస్తే డబ్బులు రావని భావించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకుంది. తన ఒక్క దాని వల్ల ఈ పని కాదు కాబట్టి ఇతరుల సాయం పొందాలనుకుంది.
ఈక్రమంలోనే తన సోదరి కమల (42)కు విషయం చెప్పింది. అయితే కలును చంపేందుకు తన ప్రియుడు 38 ఏళ్ల దినేష్ మైదా సాయం తీసుకుంటే బాగుందని కమల సూచించింది. ఇలా కాంత.. 15 లక్షలు ఆఫర్ చేసి మరీ భర్తను చంపమని చెప్పింది. అది రోడ్డు ప్రమాదంలా ఉండాలని వివరించింది. దీంతో దినేష్ తన స్నేహితులు అయిన వినోద్, శ్రవణ్‌ల సాయం తీసుకున్నాడు. కలుకు ఫోన్ చేసి తమ ఇంటికి పిలిపించుకున్నారు. ఆపై మత్తు మందు కలిపిన మద్యం తాగించారు. అతడు స్పృహ తప్పగానే కర్రలతో తలపై కొట్టారు.
ఆపై కారులో తీసుకు వెళ్లి బన్స్వారాలోని సదర్ ప్రాంతం జాతీయ రహదారిపై పడేశారు. ఆపై ఆయన పైనుంచి కారును తీసుకువెళ్లారు. అయితే రోడ్డుపై మృతదేహం ఉండడం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే కాలుపై ఉన్న కలు పేరు చూసి.. అతడిని గుర్తించారు. ఆ తర్వాత కలు భార్య కాంతకు విషయం తెలిపారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్న కాంత, ఆమె సోదరి కమలలో బాధకు బదులు కంగారు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.
ఈక్రమంలోనే పోలీసులు ఇద్దరినీ వేర్వేరుగా విచారించగా.. ఒక్కొక్కరూ ఒక్కోలా సమాధానం చెప్పారు. దీంతో పోలీసులకు మరింత అనుమానం పెరగి తమదైన స్టైల్‌లో విచారించారు. అలా కాంత తానే భర్తను చంపాలనుకున్నాని తెలిపింది. అలాగే ఇన్సూరెన్స్ డబ్బులు పొందేందుకే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం పోలీసులు కాంత, కమల, దినేష్‌లను అరెస్ట్ చేశారు. వీరికి సాయం చేసిన వినోద్, శ్రవణ్‌లను కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పుకొచ్చారు.