ఒక ప్రముఖ పత్రిక, చానల్‌కు అనుచిత లబ్ధి చేకూర్చారనే ఆరోపణలతో సమాచార పౌరసంబంధాల (ఐ అండ్ పీఆర్) శాఖ పూర్వ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఏసీబీ అధికారులను గురువారం హైకోర్టు ఆదేశించింది. విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.వైసీపీ ప్రభుత్వం ఆ పత్రిక, చానల్‌కు అనుచిత లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, సాక్షి మీడియా గ్రూపులో పనిచేస్తున్న పలువురు సిబ్బందిని ఐ అండ్ పీఆర్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌లో ఉద్యోగులుగా చట్టవిరుద్ధంగా నియమించారంటూ.. అప్పటి కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డిపై ఏపీ మీడియాఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ ఢిల్లీబాబురెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌ను అరెస్టు చేస్తారనే ఆందోళన ఉందని.. మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామన్నారు.