2015లో దాదాపు రూ.7 కోట్ల విలువైన 200 కిలోల డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎనిమిది మంది పాక్ జాతీయులకు ముంబై కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ నిరోధక చట్టం కింద ఎనిమిది మందిని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దోషులుగా నిర్ధారించారు. వారికి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించారు.2015లో గుజరాత్ తీరంలో హెరాయిన్‌ను తరలిస్తున్న పడవను భారత కోస్ట్ గార్డ్ అధికారులు పట్టుకున్నారు. అందులో 11 డ్రమ్ములు, 20 ప్లాస్టిక్ ప్యాకెట్లలో పొడిని గుర్తించారు. ప్యాకెట్లలోని పదార్థాన్ని హెరాయిన్‌గా తేల్చారు. దీనికి సంబంధించి ఎనిమిది మంది పాక్ జాతీయులను అరెస్ట్ చేశారు.వారితో పాటు మూడు శాటిలైట్ ఫోన్లు, జీపీఎస్ నావిగేషన్ చార్ట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. ఆ తర్వాత నిందితులను దక్షిణ ముంబై పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిందితులకు గరిష్ఠంగా శిక్ష విధించాలని, అప్పుడే ఇలా డ్రగ్స్ అక్రమ రవాణాదారులకు హెచ్చరిక అవుతుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి ఈరోజు కేసులో దోషులకు శిక్షను ఖరారు చేశారు.