తమ సొంత గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పోలీసు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరు కావాలంటూ. ఈ కేసులో ఏ1గా ఉన్న జయసుధకు నిన్న పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మధ్యాహ్నం (జనవరి 1 మధ్యాహ్నం 2 గంటలకు) విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మచిలీపట్నం పీఎస్ లో విచారణకు హాజరయ్యారు. మచిలీపట్నం మేయర్ కారులో తన న్యాయవాదులతో కలిసి ఆమె పీఎస్ కు వెళ్లారు. ఆర్ పేట సీఐ ఏసుబాబు ఆమెను విచారించారు. దాదాపు 2 గంటల సేపు విచాణ కొనసాగింది. విచారణకు ఆమె తరపు న్యాయవాదులను పోలీసులు అనుమతించ లేదు.గోడౌన్ లో స్టాక్ తగ్గడానికి గల కారణాలేమిటి? బియ్యం గోడౌన్ నుంచి బయటకు ఎలా వెళ్లింది? అని జయసుధను పోలీసులు ప్రశ్నించారు. వేయింగ్ మిషన్ల వల్లే స్టాక్ లో తేడా వచ్చిందని... తాము బాధ్యతగా రూ. 1.70 కోట్ల జరిమానాను చెల్లించామని జయసుధ తెలిపారు. అయితే... ఎంవోయూ ప్రకారం స్టాక్ లో తేడా వస్తే జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఉందని పోలీసులు తెలిపారు.