ముంబయి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్.. వెంటనే విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించారు. ఎటువంటి ప్రమాదం లేకుండా విజయవంతంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాల గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. దీనికి సాంకేతిక సమస్యలు సహా వివిధ కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే దక్షిణ కొరియాలో విషాదకరమైన ఘటన జరిగింది. జెజు ఎయిర్ విమానం మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విమాన ప్రయాణికులను మరింతగా భయపెట్టింది.
ఎమర్జెన్సీ సమయంలో జాగ్రత్తలు..
1.విమానం బయలుదేరే ముందు ఎయిర్ హోస్టెస్‌లు ఎమర్జెన్సీ సమయంలో ఏమి చేయాలో వివరించే డెమో ఇస్తారు. ఆ సూచనలను జాగ్రత్తగా విని, మనసులో ఉంచుకోవాలి.
2.ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఎక్కడ ఉన్నాయో గమనించాలి. ఆక్సిజన్ మాస్క్‌లు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఎమర్జెన్సీ లైఫ్ జాకెట్‌లు ఎక్కడ ఉన్నాయో గమనించి గుర్తుంచుకోవాలి.
3.ఎమర్జెన్సీ సమయంలో గందరగోళం చెందకుండా, శాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎయిర్ హోస్టెస్‌ల సూచనలను పాటించాలి. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలకు సాయం చేయాలి.
4.ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల వద్దకు వేగంగా కదలాలి. ఎవరినీ అడ్డుకోకుండా జాగ్రత్తపడాలి. ఎమర్జెన్సీ స్లైడ్‌పై జారి దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
5.ఎమర్జెన్సీ సమయంలో వ్యక్తిగత వస్తువుల గురించి ఆందోళన చెందకుండా.. ఫస్ట్ ప్రాణాలను రక్షించడంపై దృష్టి పెట్టాలి.